పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి

ఎస్పీ మహేశ్వర రెడ్డి

  • ‘డయల్ యువర్ ఎస్పీ’ కార్యక్రమంలో వినతుల స్వీకరణ..
  • సత్వర పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ: జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి తెలిపారు. పోలీసు సిబ్బంది తమ సమస్యలను నేరుగా జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకురావడానికి ఏర్పాటు చేసిన ‘డయల్ యువర్ ఎస్పీ – పోలీసు గ్రీవెన్స్’ కార్యక్రమాన్ని శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లు, విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది 6309990800 టెలిఫోన్ నంబర్ ద్వారా తమ సమస్యలు, వినతులు, సంక్షేమానికి సంబంధించిన అంశాలను ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు.

సిబ్బంది నుంచి వచ్చిన ప్రతి వినతిని శ్రద్ధగా విన్న ఎస్పీ, వాటిని వెంటనే పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలీసు శాఖలో పనిచేసే ప్రతి సిబ్బంది సంక్షేమానికి జిల్లా పోలీసు యంత్రాంగం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.

విధి నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులు, సమస్యలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించిన ఎస్పీ, పోలీసు సిబ్బంది సంక్షేమానికి సంబంధించిన అంశాల్లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.