సీనియర్ చేనేత కార్మికులకు సన్మానం

ఎగుమతిదారులుగా ఎదగాలని పిలుపునిచ్చిన కన్వీనర్ కలవకొలను నాగ తులసీరావు

నర్సాపురం, ఆంధ్రప్రభ: నర్సాపురం మండలంలోని హస్తకళల ఎగుమతి ప్రోత్సాహక సంస్థ (ఈపీసీహెచ్) – అంతర్జాతీయ లేసు ట్రేడ్ సెంటర్ (ఐఎల్‌టీసీ) ఆధ్వర్యంలో శుక్రవారం 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని ఐఎల్‌టీసీ కన్వీనర్ కలవకొలను నాగ తులసీరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సాపురం పరిసర ప్రాంతాల చేనేత కార్మికులు సంఘాలుగా ఏర్పడి తమ ఉత్పత్తులను స్వయంగా ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. చేనేత కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ఈపీసీహెచ్ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం సీనియర్ చేనేత కార్మికులను నాగ తులసీరావు ఘనంగా సన్మానించి, వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఈపీసీహెచ్ సబ్ కమిటీ సభ్యులు కె. రాజీవ్ చంద్ర, ఎగుమతిదారుల సభ్యులు అడ్డగళ్ల బాబు, సీనియర్ చేనేత కార్మికులు అలంక నాగేశ్వరరావు, మావూరి ఆనంద్‌తో పాటు సుమారు 50 మంది చేనేత కార్మికులు పాల్గొన్నారు.