ఆదివాసీల అభివృద్ధికి నిధులు కేటాయించాలి

ఆదివాసీ హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి
తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటీ డిమాండ్

చెన్నూర్, ఆంధ్రప్రభ : ఆదివాసీల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటీ నాయకులు డిమాండ్ చేశారు.

శుక్రవారం చెన్నూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు భాగల రాజన్న, కార్యదర్శి ఎర్మా పున్నం మాట్లాడారు. ఈ నెల 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వారోత్సవాల ముగింపు సభను చెన్నూర్ పట్టణ కేంద్రంలో నిర్వహించనున్నట్లు చెప్పారు.

ఆదివాసీ పోడు రైతులపై అటవీశాఖ అధికారులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నప్పటికీ నియోజకవర్గంలోని మంత్రి వివేక్ స్పందించకపోవడం బాధాకరమన్నారు. తరతరాలుగా పోడు సాగుపై ఆధారపడి జీవిస్తున్న రైతులపై అటవీ అధికారులు దౌర్జన్యాలకు పాల్పడుతూ అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు.

ఈ సమస్యలపై పాలకులకు, జిల్లా అధికారులకు వినతిపత్రాలు అందజేసినా ఫలితం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల అభివృద్ధి కోసం గ్రామాలకు రహదారులు, విద్యుత్, విద్య, వైద్యం వంటి మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించాల్సి ఉన్నప్పటికీ తగినన్ని నిధులు కేటాయించకపోవడం శోచనీయమన్నారు.

భవిష్యత్తులో ఆదివాసీ హక్కుల సాధన కోసం, తమ సంస్కృతిని కాపాడుకోవడం కోసం కొమరం భీం పోరాట స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు మడే గణేష్, కోర్తే సమ్మయ్య, కొండపల్లి వెంకటి, తలండి మల్లేష్ పాల్గొన్నారు.