నేతన్నల కడుపు కొడుతున్న కాంగ్రెస్..
- సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ
- చేనేత సంక్షేమ పథకాలను వెంటనే పునరుద్ధరించాలి: కేటీఆర్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ సంస్కృతి, అస్తిత్వానికి వెన్నెముకగా నిలిచిన చేనేత రంగం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) ఆరోపించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన చేనేత సంక్షేమ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
జాతీయ చేనేత దినోత్సవం కేవలం ఉత్సవాలు నిర్వహించుకునే రోజు కాదని, చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే విధానాలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రెండూ కలిసి చేనేత రంగాన్ని సంక్షోభంలోకి నెట్టాయని విమర్శించారు.
నేతన్న బీమా, నేతన్నకు చేయూత నిలిపివేశారు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేశంలో ఎక్కడా లేని విధంగా చేనేత కార్మికుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని కేటీఆర్ గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 55,072 మంది చేనేత కార్మికులకు రూ.5 లక్షల జీవిత బీమా అందించేలా ‘నేతన్న బీమా’ పథకాన్ని అమలు చేశామని తెలిపారు. ఈ పథకంలో బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరించిందని పేర్కొన్నారు.
అలాగే ‘నేతన్నకు చేయూత’ పథకం ద్వారా చేనేత కార్మికుల పొదుపును ప్రోత్సహించామని వివరించారు. కార్మికుడు ప్రతి నెల రూ.1,200, అనుబంధ కార్మికుడు రూ.800 చెల్లిస్తే ప్రభుత్వం రూ.4,000 వరకు తన వాటా జమ చేసే వినూత్న పథకాన్ని అమలు చేశామని తెలిపారు.
సహకార సంఘాలకు అండగా నిలిచాం
చేనేత సహకార సంఘాలకు పావలా వడ్డీ రుణాలు, 20 శాతం మార్కెటింగ్ రిబేట్ కల్పించామని కేటీఆర్ పేర్కొన్నారు. బతుకమ్మ చీరలు, ప్రభుత్వ పాఠశాలల యూనిఫారాల తయారీ వంటి భారీ ప్రభుత్వ ఆర్డర్లను చేనేత రంగానికే అప్పగించి వేలాది కుటుంబాలకు నిరంతర ఉపాధి కల్పించామని తెలిపారు.
ఎన్నికల హామీల్లో ఒక్కటీ అమలు కాలేదు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత రంగానికి సంబంధించిన సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని కేటీఆర్ ఆరోపించారు. చేనేత సహకార సంఘాలకు ఇవ్వాల్సిన పావలా వడ్డీ రుణాలు, మార్కెటింగ్ రిబేట్లు నిలిచిపోయాయని, బతుకమ్మ చీరలు, ప్రభుత్వ యూనిఫారాల ఆర్డర్లలో నేతన్నలకు గతంలో ఇచ్చిన ప్రాధాన్యత తగ్గిందని విమర్శించారు. ప్రభుత్వ ఆర్డర్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని ఆరోపించిన ఆయన, ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించిన హామీల్లో ఒక్కటీ అమలు కాలేదన్నారు.
అమలు కాని హామీలు ఇవే..
కేటీఆర్ ప్రకారం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేయని హామీల్లో..
చేనేత భరోసా కింద ప్రతి ఏడాది రూ.18 వేల ఆర్థిక సాయం
అనుబంధ కార్మికులకు రూ.6 వేల వార్షిక సహాయం
లక్ష రూపాయల వరకు వ్యక్తిగత రుణమాఫీ
చేనేత సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ రుణాల మాఫీ
కేంద్రం విధిస్తున్న 5 శాతం జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్న హామీ
వంటి అంశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
బీజేపీ ప్రభుత్వంపైనా విమర్శలు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా చేనేత రంగానికి తీవ్ర అన్యాయం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు, హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డు, పవర్‌లూమ్ బోర్డులను రద్దు చేయడం, హౌస్ కమ్ వర్క్‌షెడ్ వంటి పథకాలను నిలిపివేయడం, చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ విధించడం వంటి నిర్ణయాలు ఈ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని విమర్శించారు.
పథకాలు వెంటనే పునరుద్ధరించాలి
చేనేత కళాకారుల కోసం ప్రత్యేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన అమలు చేయాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. గతంలో అమలైన అన్ని చేనేత సంక్షేమ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. “మన చేనేత… మన గౌరవం. నేతన్న బాగుంటేనే చేనేత బాగుంటుంది. చేనేత బాగుంటేనే తెలంగాణ సంస్కృతి, ఆత్మగౌరవం నిలుస్తాయి. ఇప్పటికైనా మోసపూరిత వైఖరిని వీడి నేతన్నల కుటుంబాలకు అండగా నిలవాలి” అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాసిన లేఖలో కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
