మిషన్ భగీరథకు పదేళ్లు..

  • దేశానికే ఆదర్శంగా కేసీఆర్ మానసపుత్రిక
  • తెలంగాణ తాగునీటి విప్లవానికి దశాబ్ది : హరీశ్‌రావు

హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో ఇంటింటికీ సురక్షితమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన మిషన్ భగీరథ పథకం పదేళ్లు పూర్తి చేసుకోవడం సంతోషకరమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు అన్నారు. రాష్ట్ర ప్రజల జీవితాలను మార్చిన మహత్తర ప్రణాళికగా మిషన్ భగీరథ నిలిచిందని పేర్కొన్నారు.

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మానసపుత్రికగా రూపుదిద్దుకున్న ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, తాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని తెలిపారు. మిషన్ భగీరథ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో హరీశ్‌రావు తెలంగాణలో తాగునీటి సమస్య చరిత్ర, పథకం రూపకల్పన, అమలు, సాధించిన ఫలితాలు, ప్రస్తుత పరిస్థితులపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం..

“తెలంగాణలో ఏ ఇంట్లోనూ తాగునీటి కోసం ఇబ్బంది ఉండకూడదు.. ఏ తల్లి కూడా బిందె పట్టుకుని కిలోమీటర్ల దూరం నడవకూడదు.. ఏ గ్రామం కూడా వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కోకూడదు” అనే సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం మిషన్ భగీరథకు శ్రీకారం చుట్టిందని హరీశ్‌రావు గుర్తు చేశారు.

2016 ఆగస్టు 7న గజ్వేల్ నియోజకవర్గంలోని కోమటిబండ గ్రామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా మిషన్ భగీరథ ప్రారంభమైందని హరీశ్‌రావు గుర్తు చేశారు. పదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ బృహత్తర ప్రాజెక్టు ప్రజల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపిందన్నారు. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న అతిపెద్ద తాగునీటి మౌలిక వసతుల ప్రాజెక్టుగా మిషన్ భగీరథ నిలిచిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “హర్ ఘర్ జల్” కార్యక్రమానికి కూడా తెలంగాణ నమూనా స్ఫూర్తిగా నిలిచిందని ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గ్రామాలు, తండాలు, మారుమూల ప్రాంతాల్లో తాగునీటి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేదని హరీశ్‌రావు గుర్తు చేశారు. మహిళలు బిందెలు మోసుకుంటూ కిలోమీటర్ల దూరం నడిచి నీళ్లు తెచ్చుకోవడం నిత్యకృత్యంగా మారిందన్నారు. చాలా గ్రామాల్లో చేతి పంపులు, బోర్లు, స్థానిక నీటి వనరులపైనే ప్రజలు ఆధారపడేవారని, భూగర్భ జలాలు అడుగంటిన ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని తెలిపారు.

ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో విషపూరిత నీటిని తాగడం వల్ల వేలాది మంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ఎముకలు వంకర్లు తిరగడం, పిల్లల ఎదుగుదల దెబ్బతినడం వంటి సమస్యలు విస్తృతంగా కనిపించేవని గుర్తు చేశారు. కలుషిత నీటి కారణంగా డయేరియా, మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ప్రబలేవని తెలిపారు.

కేసీఆర్ దూరదృష్టితో రూపుదిద్దుకున్న ప్రాజెక్టు

ఈ దుస్థితిని శాశ్వతంగా మార్చాలంటే తాత్కాలిక చర్యలు సరిపోవని గుర్తించిన కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర తాగునీటి గ్రిడ్ నిర్మించాలనే ఆలోచన చేశారని హరీశ్‌రావు వివరించారు. అదే మిషన్ భగీరథగా రూపుదిద్దుకుందని తెలిపారు. గోదావరి, కృష్ణా నదుల నుంచి ఉపరితల జలాలను సేకరించి, శుద్ధి చేసి, భారీ పైప్‌లైన్ల ద్వారా గ్రామాలు, పట్టణాలు, మారుమూల ప్రాంతాలకు తరలించి ఇంటింటికీ సరఫరా చేసే సమగ్ర వ్యవస్థను నిర్మించామని పేర్కొన్నారు. ఒక రాష్ట్రం మొత్తం తాగునీటి అవసరాలను ఒకే సమగ్ర వ్యవస్థ ద్వారా తీర్చాలనే ఆలోచన దేశంలోనే అరుదైనదని, అందుకే మిషన్ భగీరథ తెలంగాణ మాత్రమే కాకుండా దేశ చరిత్రలోనూ ఒక మైలురాయిగా నిలిచిందని అన్నారు.

మిషన్ భగీరథ అమలుతో గ్రామీణ తెలంగాణలో మహిళలు తాగునీటి కోసం పడే కష్టాలు గణనీయంగా తగ్గాయని హరీశ్‌రావు తెలిపారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో సురక్షిత తాగునీరు అందుబాటులోకి రావడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో స్వచ్ఛమైన తాగునీటిని అందించడంలో మిషన్ భగీరథ కీలక పాత్ర పోషించిందన్నారు. ఫ్లోరైడ్ రహిత తెలంగాణ సాధనలో ఈ పథకం ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందని చెప్పారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన అమృతజల ప్రణాళికగా మిషన్ భగీరథ చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద గ్రామీణ తాగునీటి గ్రిడ్‌లలో ఒకటి

కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం గోదావరి, కృష్ణా నదుల జలాలను వినియోగిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద గ్రామీణ తాగునీటి పంపిణీ వ్యవస్థలలో ఒకదాన్ని నిర్మించిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.20 లక్షల కిలోమీటర్లకు పైగా పైప్‌లైన్లు ఏర్పాటు చేసి, 23,968 గ్రామీణ ఆవాసాలకు శుద్ధి చేసిన తాగునీటిని అందించే వ్యవస్థను నిర్మించామని తెలిపారు. కోట్లాది మంది ప్రజలకు నాణ్యమైన తాగునీరు అందుబాటులోకి వచ్చిందని వివరించారు. ఒకప్పుడు ప్రతిరోజూ ఎదురైన నీటి సమస్య ఇప్పుడు ప్రాథమిక హక్కుగా మారిందని, ఒకప్పుడు భారం అనిపించిన నీటి సేకరణ ఇప్పుడు గౌరవప్రదమైన జీవనంలో భాగమైందని ఆయన పేర్కొన్నారు.

మిషన్ భగీరథ కేవలం తాగునీటి పథకం కాదని, ఇది సామాజిక మార్పుకు దోహదపడిన కార్యక్రమమని హరీశ్‌రావు తెలిపారు. ఈ పథకం వల్ల మహిళలు నీటి కోసం గంటల తరబడి తిరగాల్సిన అవసరం లేకుండా పోయిందని, వారి సమయం ఆదా కావడంతో కుటుంబ సంక్షేమం, పిల్లల విద్య, ఉపాధి అవకాశాలపై మరింత దృష్టి పెట్టగలిగారని పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్యం మెరుగుపడిందని, పరిశుభ్రమైన నీరు అందుబాటులోకి రావడంతో నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు తగ్గాయని, ప్రజారోగ్య రంగంలో గణనీయమైన మార్పు చోటుచేసుకుందని వివరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మిషన్ భగీరథ నిర్వహణలో విఫలమైందని హరీశ్‌రావు ఆరోపించారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మళ్లీ తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయని హరీశ్‌రావు ఆరోపించారు. మూడు సంవత్సరాల లోపే మిషన్ భగీరథ ద్వారా సాధించిన పురోగతి దెబ్బతింటోందని, అనేక ప్రాంతాల్లో ప్రజలు మళ్లీ తాగునీటి కొరతను ఎదుర్కొంటున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన ఈ మహత్తర వ్యవస్థను సమర్థంగా నిర్వహించలేకపోవడం బాధాకరమని అన్నారు. “కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం కాబట్టి నిర్లక్ష్యం చేయడం అత్యంత బాధ్యతారాహిత్యం. ప్రభుత్వాలు మారవచ్చు.. కానీ ప్రజల అవసరాలు మారవు. రాజకీయ కక్షలకు ప్రజా ప్రయోజనాలను బలి చేయొద్దు” అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.

మిషన్ భగీరథ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. దెబ్బతిన్న పైప్‌లైన్లు, మోటార్లు, పంపింగ్ వ్యవస్థలను వెంటనే మరమ్మతు చేయాలని కోరారు. రాష్ట్రంలో ఎక్కడైనా తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడితే వెంటనే స్పందించేలా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు.

తెలంగాణ అభివృద్ధి గాథలో చిరస్మరణీయ అధ్యాయం

మిషన్ భగీరథ ఒక ఇంజినీరింగ్ అద్భుతం మాత్రమే కాదని, అది దూరదృష్టి నాయకత్వానికి ప్రతీక అని హరీశ్‌రావు అన్నారు. పెద్ద కలలు కనడానికి ధైర్యం ఉంటే ప్రభుత్వాలు ప్రజల జీవితాలను శాశ్వతంగా మార్చగలవని ఈ ప్రాజెక్టు నిరూపించిందని పేర్కొన్నారు. తెలంగాణ దాహాన్ని తీర్చిన మహత్తర కార్యక్రమంగా, దేశానికి స్ఫూర్తినిచ్చిన అభివృద్ధి నమూనాగా, రాష్ట్ర ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన సంక్షేమ యజ్ఞంగా మిషన్ భగీరథ చరిత్రలో నిలిచిపోతుందని ఆయన తెలిపారు. “మిషన్ భగీరథ కేవలం నీటి సరఫరా కథ కాదు. అది తెలంగాణ దూరదృష్టి, సంకల్పం, అభివృద్ధి, సామాజిక మార్పు, ప్రజా సంక్షేమానికి ప్రతీక. తెలంగాణ చరిత్రలో ఈ ప్రాజెక్టు ఎప్పటికీ ఒక స్వర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది” అని హరీశ్‌రావు పేర్కొన్నారు.