ప్రజలతో మమేకమైన మంత్రి అనిత

  • ఒడ్డిమెట్ట గ్రామంలో పర్యటన
  • సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన

అనకాపల్లి, ఆంధ్రప్రభ: హోంమంత్రి వంగలపూడి అనిత అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఒడ్డిమెట్ట గ్రామంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా వినాయకస్వామి, ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం తీసుకున్నారు.

అనంతరం “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం ఇంటింటి” కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటికీ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో ఆత్మీయంగా మమేకమై వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. గ్రామ ప్రజలు, మహిళలు చూపిన ఆదరణ తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని అనిత తెలిపారు. స్థానిక మహిళలతో కలిసి కోలాటంలో పాల్గొనడం తనకు ప్రత్యేక అనుభూతిని ఇచ్చిందన్నారు.

పాయకరావుపేట నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ.660 కోట్లకు పైగా సంక్షేమ కార్యక్రమాలు, రూ.500 కోట్లకు పైగా అభివృద్ధి పనులు అమలు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. అలాగే రానున్న స్టీల్ ప్లాంట్‌తో వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, మరింత అభివృద్ధి, మరింత సంక్షేమం లక్ష్యంగా తన ప్రయాణం కొనసాగుతుందని వంగలపూడి అనిత స్పష్టం చేశారు.