మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి
100కుపైగా చేనేత స్టాల్స్ ప్రారంభం
రైతన్నకు, నేతన్నకు సమాన ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం
ఆగస్టు 16 వరకు చేనేత వస్త్ర ప్రదర్శన

హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : చేనేత కార్మికుల సంక్షేమం, చేనేత రంగ పునరుజ్జీవనమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత & జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతన్నతో పాటు నేతన్నకు కూడా సమాన ప్రాధాన్యం కల్పిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు.

జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత పురస్కారాలు అందుకున్న చేనేత కళాకారులను సన్మానించి అభినందించారు. వారి సేవలు కొత్త తరానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

అనంతరం పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన 100కు పైగా చేనేత స్టాల్స్‌ను ప్రారంభించి పరిశీలించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చేనేత కళాకారులు ప్రదర్శించిన సంప్రదాయ, ఆధునిక వస్త్రాలను మంత్రి సందర్శించారు. ఈ చేనేత వస్త్ర ప్రదర్శన ఆగస్టు 7 నుంచి 16వ తేదీ వరకు కొనసాగుతుందని, ప్రజలు పెద్ద సంఖ్యలో సందర్శించి చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి నేతన్నలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చేనేత అనేది కేవలం ఉపాధి రంగం మాత్రమే కాదని, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. గద్వాల చీరలు, పోచంపల్లి ఇక్కత్, నారాయణపేట వస్త్రాలు, సిద్దిపేట గొల్లభామ చీరలు, వరంగల్ దర్రీస్, కరీంనగర్ బెడ్‌షీట్లు తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయని తెలిపారు.

చేనేత రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్న మంత్రి.. చేనేత కార్మికుల జియో ట్యాగింగ్‌లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (IIHT) ద్వారా యువతకు ఆధునిక శిక్షణ అందిస్తున్నామని, అక్కడ శిక్షణ పొందిన విద్యార్థి రూపొందించిన ఆవిష్కరణ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణమని చెప్పారు.

చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న నేతన్న పొదుపు, నేతన్నకు భద్రత, నేతన్న భరోసా వంటి పథకాలతో పాటు రుణమాఫీ చర్యలను మంత్రి వివరించారు. చేనేత కుటుంబాల ఆర్థికాభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ (సీతక్క), జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకట్ రమణ, టెస్కో అధికారులు, చేనేత రంగ ప్రముఖులు, అవార్డు గ్రహీతలు, చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు పాల్గొన్నారు.