28వ వారానికి చేరిన సర్వోదయ చరక అభ్యాస కార్యక్రమం
హనుమకొండ, ఆంధ్రప్రభ: గాంధేయ సిద్ధాంతాల ప్రచారం, స్వయం సమృద్ధి లక్ష్యంగా హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సర్వోదయ చరక అభ్యాస కార్యక్రమం 28వ వారానికి చేరుకుంది. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని చరకాతో నూలు వడికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఆశయాలు, స్వదేశీ భావనను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కార్యక్రమం ఉద్దేశమన్నారు. 28 వారాలుగా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న నాయకులు, కార్యకర్తలను అభినందించారు. గాంధేయవాదం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. చరకా స్వయం ఉపాధి, ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. యువతకు గాంధీజీ సిద్ధాంతాలను చేరవేయడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలకమన్నారు.
కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి కూచన రవళి రెడ్డి, గ్రేన్ మార్కెట్ చైర్పర్సన్ పులి ప్రియాంక అనిల్, రాష్ట్ర ఎస్సీ విభాగం ఉపాధ్యక్షురాలు గోవిందు శ్వేత, డీసీసీ కమిటీ సభ్యులు, వివిధ విభాగాల అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, మహిళా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
