విద్యుత్ సమస్యలకు నెల గడువు..
ఆసుపత్రి అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
భూపాలపల్లి, ఆంధ్రప్రభ: విద్యుత్ సమస్యలు, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి, ప్రజారోగ్యం, అటవీ భూముల వివాదాల పరిష్కారంపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సంబంధిత శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వివిధ వార్డుల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను నెల రోజుల్లో పరిష్కరించాలని విద్యుత్ శాఖ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతుల లోపాలను మరో 15 రోజుల్లో పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పల్లె దవాఖానల్లో మౌలిక వసతుల కల్పనకు అంచనాలు సిద్ధం చేసి కలెక్టర్కు, ఎమ్మెల్యేకు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. క్షయవ్యాధి, హెచ్ఐవీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, బాధితులకు నిరంతరం మందులు, వైద్య సేవలు అందించాలని సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఆసుపత్రికి సింగరేణి విద్యుత్ సరఫరా అనుసంధానంపై మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేయాలని ప్రతిపాదించారు. ఆసుపత్రిలో రూ.14 కోట్లతో అదనపు అంతస్తు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆసుపత్రి సమస్యల పరిష్కారంపై మరో 15 రోజుల్లో ప్రత్యేక అభివృద్ధి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
అటవీ భూముల అంశంలో శాఖల మధ్య సమన్వయంతో పెండింగ్ వివాదాలను త్వరగా పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. 6, 26, 5 వార్డుల్లో నిర్మిస్తున్న రక్షణ గోడ పనులకు అనవసర జోక్యం చేసుకోవద్దని తెలిపారు. జంగేడు రోడ్డుతో పాటు ప్రధాన రహదారిలోని డబ్బాలను వెనక్కి తరలించాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
