Politics | ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు యువత.. దేశంలో కొత్త శకం మొదలైందా?

Politics | ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు యువత.. దేశంలో కొత్త శకం మొదలైందా?

Politics | సాంప్రదాయ పార్టీలపై పెరుగుతున్న అసంతృప్తి..
కొత్త నాయకత్వానికి లభిస్తున్న ఆదరణ..
బీహార్ నుంచి ఢిల్లీ వరకు మారుతున్న రాజకీయ సమీకరణాలు

Politics | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: దేశ రాజకీయాల్లో కొత్త మార్పులకు సంకేతాలు కనిపిస్తున్నాయా? దశాబ్దాలుగా అధికార, ప్రతిపక్షాలుగా కొనసాగుతున్న సంప్రదాయ రాజకీయ పార్టీలపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో అసంతృప్తి పెరుగుతోందా? ఇటీవల దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న కొన్ని రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు ఓటర్ల మొగ్గు పెరుగుతోందనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.

తాజాగా బీహార్‌లోని బాంకీపూర్ ఉపఎన్నికలో జన సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ విజయం సాధించడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. బీజేపీ బలమైన స్థావరంగా భావించే ఈ నియోజకవర్గంలో ఎన్నోసార్లు గెలిచిన నితిన్ నబిన్‌పై సుమారు 19 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం సాధారణ రాజకీయ పరిణామంగా చూడలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిశోర్.. ప్రజా ఉద్యమాల ద్వారా రాజకీయ ప్రత్యామ్నాయం నిర్మిస్తానని ప్రకటించి, తక్కువ సమయంలోనే ప్రజల మద్దతు సంపాదించడం ఆసక్తికర పరిణామంగా మారింది.

దేశ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ప్రత్యామ్నాయ రాజకీయాలకు ఇది మొదటి ఉదాహరణ కాదు. 1975లో విధించిన అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) అనంతరం లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్, చరణ్ సింగ్, వాజ్ పేయి వంటి నాయకుల నేతృత్వంలో కాంగ్రెస్ వ్యతిరేక శక్తులు ఒక్కటై జనతా పార్టీగా ఏర్పడి అధికారంలోకి వచ్చాయి. ఆ ఎన్నికల ఫలితంగా మొరార్జీ దేశాయ్ తొలి కాంగ్రెసేతర ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో సోషల్ మీడియా, డిజిటల్ ప్రచారం లేకపోయినా ప్రజలు ఓటు ద్వారా తమ అసంతృప్తిని స్పష్టంగా వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో కూడా ఇదే ధోరణి కనిపించింది. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా అవతరించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రావడం దేశ రాజకీయాల్లో కీలక మలుపుగా నిలిచింది. అలాగే తమిళనాట నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) తక్కువ కాలంలోనే ప్రధాన రాజకీయ శక్తిగా ఎదగడం, ఆపై ముఖ్యమంత్రిగా అధికారం కూడా చేపట్టారు.

మరోవైపు ఇటీవల వెలుగులోకి వచ్చిన “జెన్ జీ” ఉద్యమం కూడా యువతలో కొత్త రాజకీయ చైతన్యానికి ఉదాహరణగా చెబుతున్నారు. పార్టీ ఆవిర్భవించిన కొద్ది కాలంలోనే లక్షలాది మంది యువతను ఆకర్షించడం, సామాజిక మాధ్యమాల్లో భారీ మద్దతు సంపాదించడం, జంతర్ మంతర్ వేదికగా నిర్వహించిన ఆందోళనలతో జాతీయ స్థాయిలో చర్చకు దారితీయడం వంటి పరిణామాలు రాజకీయ పార్టీల దృష్టిని ఆకర్షించాయి. అయితే ప్రత్యామ్నాయ పార్టీగా అవతరించడం ఒక దశ మాత్రమే. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం, ఎన్నికల్లో విజయాలను కొనసాగించడం, సమర్థవంతమైన పాలన అందించడం వంటి అంశాలే ఆ పార్టీల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కొత్త నాయకత్వంపై ప్రజల్లో ఆశలు పెరుగుతున్నప్పటికీ, ఆ ఆశలను నిలబెట్టుకోవడం అంత తేలికైన విషయం కాదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా పరిశీలించి చూస్తే, సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా కొత్త ఆలోచనలు, కొత్త నాయకత్వం, ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు యువత ఆసక్తి చూపుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో ఈ ధోరణి మరింత బలపడుతుందా? లేక సంప్రదాయ పార్టీలే తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తాయా? అనే ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాల్సి ఉంది.