నేరగాళ్లపై పోలీసుల ఉక్కుపాదం
రాత్రివేళ విజిబుల్ పోలీసింగ్ ముమ్మరం
డ్రోన్ నిఘా, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలతో నేరాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ: జిల్లాలో నేరాలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడమే లక్ష్యంగా శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు రాత్రివేళల్లో విజిబుల్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేశారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజామున వరకు అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో ప్రత్యేక తనిఖీలు, బీట్ గస్తీ, పెట్రోలింగ్, డ్రోన్ కెమెరాలతో నిఘా నిర్వహించారు. నేరాలకు అవకాశం ఉన్న ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇతర రాష్ట్రాల నుంచి జరిగే అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ అసాంఘిక శక్తుల కదలికలను పర్యవేక్షిస్తున్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని ప్రధాన రహదారులపై డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై మోటారు వాహనాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపైనా చర్యలు చేపడుతున్నారు. రాత్రి వేళల్లో సరైన కారణం లేకుండా సంచరించే అనుమానితులను అదుపులోకి తీసుకుని వారి వివరాలు నమోదు చేయడంతో పాటు అవసరమైతే వేలిముద్రలు సేకరించి లోతైన విచారణ నిర్వహిస్తున్నారు.
చోరీలు, దొంగతనాల నివారణకు బ్యాంకులు, ఏటీఎంలు, ప్రముఖ దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, నివాస ప్రాంతాలు, తాళాలు వేసి ఉన్న ఇళ్ల వద్ద పెట్రోలింగ్ వాహనాలతో నిరంతర పహారా నిర్వహిస్తున్నారు. రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి సైబర్ నేరాల నివారణ, మహిళలు, చిన్నారుల భద్రత, బాల్య వివాహాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రజల సహకారం లేకుండా నేరాల నియంత్రణ సాధ్యం కాదని పేర్కొంటూ, అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలు లేదా అనుమానాస్పద వస్తువులు కనిపించిన వెంటనే డయల్-100 లేదా 112కు సమాచారం అందించాలని జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే జిల్లాలో శాంతిభద్రతలను మరింత పటిష్ఠంగా కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
