ఏపీటిడ్కో గృహ నిర్మాణాలపై మంత్రి సత్యకుమార్ సమీక్ష

ఏపీటిడ్కో గృహ నిర్మాణాలపై మంత్రి సత్యకుమార్ సమీక్ష
- ఆగష్టు నాటికి 1,440 ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని స్పష్టం
- పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదు: అధికారులకు హెచ్చరిక
ధర్మవరం, ఆంధ్రప్రభ: ధర్మవరం పట్టణంలోని ఏపీటిడికో గృహ నిర్మాణ పనులను వేగవంతం చేసి ఆగస్టు 2026 నాటికి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో శుక్రవారం ఏపీటిడికో అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని గృహ నిర్మాణాలు, బాహ్య మౌలిక వసతుల పురోగతిని సమగ్రంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పేదల అభివృద్ధే ప్రభుత్వ అసలు అజెండా అని పేర్కొన్నారు. ధర్మవరం పట్టణంలోని రేగాటిపల్లి ప్రాంతంలో ఏపీటిడికో ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 1440 గృహాల పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న ఈ ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదన్నారు.
అధికారులు సమీక్షలో వెల్లడించిన వివరాల ప్రకారం, ధర్మవరం ప్రాంతంలో 12.67 ఎకరాల ప్రభుత్వ భూమిలో 300 చదరపు అడుగుల విస్తీర్ణంతో 1440 గృహాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇందులో పాత ఏజెన్సీ ద్వారా 96 ఇళ్లు, రివర్స్ టెండరింగ్ ద్వారా ఎన్‌జేఆర్ సంస్థ ఆధ్వర్యంలో 1344 ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఇప్పటికే అన్ని గృహాలకు గ్రౌండింగ్ పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం మూడో అంతస్తు స్థాయికి నిర్మాణాలు చేరుకున్నాయని అధికారులు తెలిపారు.
ఎన్‌జేఆర్ సంస్థ చేపట్టిన పనుల్లో సుమారు 74 శాతం పురోగతి నమోదైందని, ఎస్పీసీఎల్ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల్లో 60 శాతం పైగా పూర్తయ్యాయని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
గృహాలకు అనుబంధంగా చేపడుతున్న బాహ్య మౌలిక వసతుల పనులపై కూడా మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి పైపులైన్లు, భూగర్భ మురుగునీటి వ్యవస్థ, జీఎల్‌ఎస్ఆర్ నిర్మాణం, పంప్ రూమ్ తదితర పనులను వేగవంతం చేయాలని సూచించారు. ప్రస్తుతం ఈ మౌలిక వసతుల పనులు 70 శాతం వరకు పూర్తయ్యాయని అధికారులు వివరించారు.
అదేవిధంగా 0.75 ఎంఎల్డీ సామర్థ్యంతో నిర్మిస్తున్న ఎస్‌టీపీ పనులను కూడా మంత్రి పరిశీలించారు. ఈ పనులు ఇప్పటికే 90 శాతం దాటినట్లు అధికారులు తెలిపారు. కాలనీకి అవసరమైన అన్ని సదుపాయాలను సమగ్రంగా సిద్ధం చేసి లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గృహాలను అందించాలని మంత్రి పేర్కొన్నారు.
ఆగస్టు 2026 నాటికి అన్ని 1440 ఇళ్లను పూర్తిస్థాయిలో సిద్ధం చేసి లబ్ధిదారులకు అందించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని హెచ్చరించారు. సమావేశంలో ఏపీటిడికో అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
