ప్రకృతి మిత్ర చేనేత.. ప్రతి దారంలో సంస్కృతి.. ప్రతి మగ్గంలో జీవన గీతం

  • ప్రకృతి రంగులతో ప్రపంచాన్ని ఆకట్టుకున్న చేనేత కళ
  • ఆంధ్రప్రదేశ్ చేనేత.. సంస్కృతికి చిరునామా
  • వెంకటగిరి నుంచి ఉప్పాడ వరకు నేత కళా వైభవం
  • లక్షల కుటుంబాలకు జీవనాధారంగా చేనేత
  • ఆధునిక ఫ్యాషన్‌లోనూ పెరుగుతున్న చేనేతకు ఆదరణ

అమరావతి, ఆంధ్రప్రభ : ప్రకృతికి హాని చేయని, శరీరానికి హితమైన, అందం-మన్నిక రెండింటినీ అందించే చేనేత నేడు ప్రపంచ ఫ్యాషన్ ప్రపంచంలోనూ తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది.

ఆంధ్రప్రదేశ్ చేనేత అనేది కేవలం వస్త్రతయారీ కాదు, అది మన సంప్రదాయం, మన కళ, మన ఆత్మగౌరవం. ప్రకృతిని కాపాడుతూ, ప్రపంచాన్ని ఆకట్టుకుంటూ, లక్షలాది కుటుంబాలకు జీవనాధారంగా నిలుస్తున్న చేనేతను ఆదరించడం అంటే మన సంస్కృతిని, మన నేతన్నను, మన భవిష్యత్తును కాపాడినట్టే.

ప్రతి చేతినేసిన వస్త్రం వెనుక ఒక కుటుంబం చిరునవ్వు దాగి ఉందనే విషయాన్ని సమాజం గుర్తించినప్పుడే చేనేతకు నిజమైన గౌరవం దక్కుతుంది.

మగ్గాల చప్పుడు… ఆంధ్రప్రదేశ్ గ్రామాల ఆత్మగానం

ఇంటి ముందు రంగురంగుల నూలు ఆరబోసిన దృశ్యాలు… గంగాళాల్లో నానబెట్టిన దారాలు… మగ్గం మీద లయబద్ధంగా కదిలే నేతన్న చేతులు… ఇవన్నీ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో భాగం.

గూడవల్లి, రాజోలు, అంబాజీపేట వంటి గ్రామాల నుంచి వెంకటగిరి, మంగళగిరి, ఉప్పాడ, ధర్మవరం, పెడన, పొందూరు వరకు మగ్గాల శబ్దమే గ్రామాల గుర్తింపుగా నిలిచింది.

పెడన కలంకారి…

ఆంధ్రప్రదేశ్ చేనేతలో అత్యంత విశిష్టమైన కళల్లో పెడన-మచిలీపట్నం కలంకారి ఒకటి.

చెట్ల బెరడులు, ఆకులు, పూలు, విత్తనాలతో తయారుచేసిన సహజరంగులతో వస్త్రాలపై బ్లాక్ ప్రింటింగ్ చేసే ఈ కళకు శతాబ్దాల చరిత్ర ఉంది.

పర్యావరణానికి హాని చేయని సహజ రంగులు, కళాత్మక నమూనాలు దీనికి ప్రపంచవ్యాప్త గుర్తింపును తీసుకొచ్చాయి. భౌగోళిక గుర్తింపు (GI) పొందడం ఈ కళా వైభవానికి నిదర్శనం.

శ్రీకాళహస్తి కలంకారి మరో అద్భుతం. ఇందులో బ్లాక్ ప్రింటింగ్ ఉండదు. కళాకారులు చేతితోనే పురాణాలు, ఇతిహాసాలు, దేవతా చిత్రాలు, ప్రకృతి దృశ్యాలను వస్త్రాలపై సజీవంగా ఆవిష్కరిస్తారు. ఈ కళకు జాతీయ స్థాయిలో ఎన్నో పురస్కారాలు లభించాయి.

ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన భారతీయ నేతన్నలు

అగ్గిపెట్టెలో ఇమిడిపోయేంత పలుచగా ఆరు గజాల చీరను నేసి భారతీయ నేతన్నలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.

సుమారు రెండు వేల సంవత్సరాల క్రితమే భారతీయ వస్త్రాలు విదేశాలకు ఎగుమతయ్యాయని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈజిప్టులోని కైరో ప్రాంతంలో లభించిన భారతీయ వస్త్రాలు మన నేత కళకు సాక్ష్యాలుగా నిలిచాయి.

లక్షల కుటుంబాల జీవనాధారం

చేనేత కేవలం ఒక పరిశ్రమ కాదు… అది లక్షలాది కుటుంబాల బతుకు బండి.

నూలు వడకడం, రంగులు అద్దడం, దారాలు తయారు చేయడం, మగ్గాల నిర్మాణం, డిజైన్లు రూపొందించడం, అద్దకం, మార్కెటింగ్… ఇలా అనేక అనుబంధ రంగాలపై లక్షలాది మంది ఆధారపడి జీవిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోనే లక్షలాది కుటుంబాలు చేనేతపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి.

ఒక్క చీర తయారీ వెనుక ఎన్నో చేతుల శ్రమ ఉంటుంది. అందుకే చేనేతను కుటుంబ ఆధారిత పరిశ్రమగా పేర్కొంటారు.

ఒక చీర వెనుక నేతన్న శ్రమ ఎంత ఉంటుందో… మహిళల పాత్ర కూడా అంతే ఉంటుంది. గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పిస్తున్న ప్రధాన రంగాల్లో చేనేత ఒకటి.

వెంకటగిరి నుంచి ఉప్పాడ వరకు…

చేనేత అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఆంధ్రప్రదేశ్ కళా సంపదే.

వెంకటగిరి చీరలు జరీ అంచులు, సున్నితమైన నేతతో రాజవంశాల కాలం నుంచే విశిష్ట గుర్తింపు పొందాయి.

మంగళగిరి కాటన్ వస్త్రాలు సరళత, మన్నిక, వేసవికాలానికి అనువైన నాణ్యతతో దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయి.

ఉప్పాడ జందాని చీరలు అత్యంత సున్నితమైన నేతకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. ఒక్క చీర నేయడానికి నెలల సమయం పట్టినా, ఆ కళాత్మకతకు అంతర్జాతీయ మార్కెట్లో ప్రత్యేక విలువ ఉంది.

ధర్మవరం పట్టుచీరలు వెడల్పాటి అంచులు, సంప్రదాయ రంగుల కలయికతో వివాహాలు, శుభకార్యాల్లో తొలి ఎంపికగా నిలుస్తున్నాయి.

పొందూరు ఖద్దర్‌ను మహాత్మా గాంధీ సైతం ప్రశంసించిన నాణ్యతకు చిహ్నం. చేతితో వడికిన నూలుతో నేసే ఈ ఖద్దర్ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది.

పటోలా, చందేరి, పైఠాని, మైసూర్ సిల్క్, తసర్, మూగా, పశ్మినా, ఖాది వంటి ఎన్నో ప్రత్యేక వస్త్రాలతో భారతీయ చేనేత ప్రపంచ ఫ్యాషన్ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

తెలంగాణలో పోచంపల్లి ఇక్కత్, గద్వాల్, గొల్లభామ చీరలు, వరంగల్ దుర్రాలు, రాజోలి రగ్గులు… ప్రతి ప్రాంతం తన కళాత్మకతను ప్రపంచానికి చాటుతోంది.

ఆధునిక ఫ్యాషన్‌లోనూ చేనేతకు పెరుగుతున్న ఆదరణ

కాలానికి అనుగుణంగా చేనేత కూడా మారుతోంది. సంప్రదాయ డిజైన్లతో పాటు ఆధునిక నమూనాలు రూపొందిస్తూ అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా నేత కళాకారులు కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.

సహజ రంగులు, పర్యావరణ హితం, చేతితో తయారైన ప్రత్యేకత… ఇవే నేటి ప్రపంచ మార్కెట్లో భారతీయ చేనేతకు మరింత విలువ తీసుకొస్తున్నాయి.