హోంగార్డు వేధింపుల ఆరోపణలు..

  • పోలీసు అధికారులపై మహిళ ఫిర్యాదు
  • ఇళ్లలో పని చేయాలని ఒత్తిడి చేశారని ఆరోపణ
  • నిరాకరించడంతో సస్పెన్షన్‌కు గురయ్యానంటున్న హోంగార్డు రూపక

విజయవాడ, కృష్ణా బ్యూరో, ఆంధ్రప్రభ : పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న రూపకళ పోలీసు ఉన్నతాధికారులపై పలు ఆరోపణలు చేస్తూ మీడియా ఎదుట తన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నివాసాల్లో వ్యక్తిగత పనులు చేయాలని తనపై ఒత్తిడి తెచ్చారని, అందుకు నిరాకరించిన తర్వాత వేధింపులకు గురిచేశారని ఆమె ఆరోపించారు.

భర్త మరణానంతరం హోంగార్డు ఉద్యోగం పొందిన తాను విధి నిర్వహణలో భాగంగా పనిచేస్తున్నప్పటికీ, పోలీసు అధికారుల ఇళ్లలో పని చేయాలని ఒత్తిడి తెచ్చారని రూపకళ తెలిపారు. తాను అంగీకరించకపోవడంతో తనపై కక్షసాధింపు చర్యలు ప్రారంభించారని ఆరోపించారు.

ఈ క్రమంలో తనను వారం రోజుల పాటు ఎస్పీ కార్యాలయానికి పంపించారని, అక్కడ విధులకు సంబంధం లేని పనులు చేయించారని ఆమె పేర్కొన్నారు. తన ఆరోగ్య సమస్యలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లభించలేదని వాపోయారు.

అంతేకాకుండా తనపై సస్పెన్షన్ చర్యలు కూడా తీసుకున్నారని రూపకళ తెలిపారు. ఒక మహిళా ఉద్యోగిగా తాను ఎదుర్కొంటున్న పరిస్థితులపై న్యాయం చేయాలని, సంబంధిత అధికారులు తన ఆరోపణలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

అయితే, రూపకళ చేసిన ఈ ఆరోపణలపై సంబంధిత పోలీసు అధికారుల స్పందన ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ అంశంపై అధికారిక వివరణ కోసం ఎదురుచూస్తున్నారు.