బధిరుల జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో నాగూర్ పాషా ప్రతిభ..
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: బధిరుల జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో ఎన్టీటీపీఎస్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఎస్.కె.మహమ్మద్ నాగూర్ పాషా ప్రతిభ కనబరిచాడు. హైదరాబాద్ మొయినాబాద్ లోని జ్వాలా గుట్ట అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ వేదికగా ఈ నెల 3 నుంచి 5 వరకు డెఫ్ ఎనబ్లెడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డీఈఎఫ్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ఫర్ ది డెఫ్ – 2026 పోటీలు నిర్వహించారు.

దేశంలోని హైదరాబాద్, విజయవాడ, తంజావూర్ (తమిళనాడు), పుదుచ్చేరి, చెన్నై, ముంబయి, పుణే, అహ్మదాబాద్ ప్రాంతాల క్రీడాకారుల మధ్య జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో నాగూర్ పాషా అత్యుత్తమ ప్రదర్శనతో అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ పోటీల్లో డబుల్స్ విభాగంలో విన్నరప్ గా, సింగిల్స్ విభాగంలో రన్నరప్ గా నిలిచి తన ప్రతిభ కనబరిచాడు. జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కు గుర్తింపు తీసుకొచ్చేలా ఆయన ప్రదర్శన నిలిచింది.
క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్ వంటి పలు క్రీడల్లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తూ బధిరుల క్రీడాకారులకు నాగూర్ పాషా ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బధిరుల క్రీడాకారులకు ప్రభుత్వాలు మరింత ప్రోత్సాహం, శిక్షణ సదుపాయాలు అందిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధిస్తామన్నారు. పలువురు క్రీడా ప్రముఖులు, సహచరులు అభినందనలు తెలిపారు.
