రెండేళ్లు వెన్నుపోటు పొడిచిన బాబు..
రెండేళ్లు వెన్నుపోటు పొడిచిన బాబు..
బాబుకు బుద్ధి చెప్పే సమయం వచ్చింది.
ప్రజలు తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారు..
వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్.
తూర్పు నియోజకవర్గంలో విస్తృత స్థాయి సమావేశం
నల్ల బెలూన్లు ఎగురవేసి కూటమి ప్రభుత్వంపై ఆందోళన
ప్రజా హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ
కూటమి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపు
విజయవాడ, ఆంధ్రప్రభ: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమైందని, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా మంగళవారం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ శ్రేణుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు నల్ల బెలూన్లు ఎగురవేసి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. సమావేశంలో దేవినేని అవినాష్‌తో పాటు రాష్ట్ర నాయకులు కడియాల బుచ్చిబాబు, రాష్ట్ర పెన్షన్ యూనియన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
దేవినేని అవినాష్ మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను నిరాశపరిచిందని ఆరోపించారు.
‘అమ్మఒడి’ పథకాన్ని ‘తల్లికి వందనం’గా మార్చినా, ప్రకటించిన విధంగా లబ్ధిదారులకు ప్రయోజనాలు అందలేదన్నారు. ఆటో డ్రైవర్లు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ విధానాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.
పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ప్రజలపై భారం పెరిగిందని, ఇసుక, మట్టి, గ్రావెల్ రంగాల్లో అక్రమాలు పెరిగాయని ఆరోపించారు. గత రెండేళ్లుగా వైసీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నప్పటికీ భయపడబోమని స్పష్టం చేశారు.
తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.2 వేల కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని, ఆ పనులను ప్రస్తుతం అధికార పార్టీ నాయకులు తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
కొండ ప్రాంత ప్రజలకు తాగునీటి సరఫరా సహా ప్రజా సమస్యలపై పార్టీ తరఫున పోరాటం కొనసాగిస్తామని, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
సమావేశంలో పలువురు నాయకులు రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించగా, వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపారు.
