రక్తనాళాల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి

  • నేడు జాతీయ వాస్కులర్ దినోత్సవం
  • మెడికవర్‌లో అవగాహన కార్యక్రమం
  • ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తిస్తే తీవ్ర సమస్యలను నివారించవచ్చు
  • డా. వై.ఎస్.ఎన్. చంద్రశేఖర్

కర్నూలు, ఆంధ్రప్రభ: రక్తనాళాల ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మెడికవర్ హాస్పిటల్స్ కర్నూల్ సీటీవీఎస్ సర్జన్ డా. వై.ఎస్.ఎన్. చంద్రశేఖర్ అన్నారు. జాతీయ వాస్కులర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో రక్తనాళాల ఆరోగ్యం, వాస్కులర్ వ్యాధుల నివారణ, ముందస్తు గుర్తింపు, సకాలంలో చికిత్స ప్రాధాన్యంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డా. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. శరీరంలోని ప్రతి అవయవానికి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల ఆరోగ్యం అత్యంత కీలకమని చెప్పారు. కాళ్లలో నొప్పి, నడిచేటప్పుడు తిమ్మిరి, కాళ్లలో వాపు, చర్మం రంగు మారడం, పాదాలపై మానని గాయాలు వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయరాదన్నారు. ఇవి వాస్కులర్ వ్యాధులకు సంకేతాలు కావచ్చని హెచ్చరించారు.

మధుమేహం, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు, ధూమపానం చేసే వారు తప్పనిసరిగా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే సమర్థవంతమైన చికిత్సతో తీవ్రమైన సమస్యలను నివారించే అవకాశం ఉంటుందని వివరించారు.

ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం, నిత్య వ్యాయామం, ధూమపానానికి పూర్తిగా దూరంగా ఉండటం ద్వారా అనేక వాస్కులర్ వ్యాధులను నివారించవచ్చని డా. చంద్రశేఖర్ పేర్కొన్నారు.

మెడికవర్ హాస్పిటల్స్ కర్నూల్ హెడ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. జాతీయ వాస్కులర్ దినోత్సవం ప్రజల్లో రక్తనాళాల ఆరోగ్యంపై చైతన్యం కల్పించే ముఖ్యమైన సందర్భంగా నిలుస్తుందని అన్నారు. వాస్కులర్ వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా ప్రాణాపాయ పరిస్థితులను నివారించవచ్చని తెలిపారు.

మెడికవర్ హాస్పిటల్స్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అనుభవజ్ఞులైన వైద్య నిపుణులతో వాస్కులర్, గుండె సంబంధిత వ్యాధులకు సమగ్ర వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. ప్రజలు ఎలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిపుణులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు.

జాతీయ వాస్కులర్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, రోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొని రక్తనాళాల ఆరోగ్యం పరిరక్షణపై అవగాహన పొందారు.