10న జైల్భరోకు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు
ఏలూరు, ఆంధ్రప్రభ: క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 10న ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడులో జైల్భరో కార్యక్రమాలు నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా–కేంద్ర కార్మిక సంఘాల సమన్వయ కమిటీ జిల్లా సమావేశం పిలుపునిచ్చింది. గురువారం ఏలూరులోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
సమావేశంలో పాల్గొన్న నాయకులు కేంద్ర ప్రభుత్వం రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆరోపించారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు పంటలకు చట్టబద్ధమైన మద్దతు ధర కల్పించాలని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని, కౌలు రైతుల రక్షణకు చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 10న జరిగే జైల్భరో కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
