వైభవంగా ఆషాఢ కృత్తిక మహోత్సవాలు

మోపిదేవి, ఆంధ్రప్రభ: కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆషాఢ కృత్తిక (ఆడి కృత్తిక) సందర్భంగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం ఆషాఢ బహుళ అష్టమి సందర్భంగా మూడో రోజు ప్రత్యేక పూజలు, వైదిక కార్యక్రమాలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఉదయం గోపూజతో కార్యక్రమాలు ప్రారంభమై సుప్రభాత సేవ, నిత్యార్చన, శ్రీ సుబ్రహ్మణ్య మూలమంత్ర అనుష్ఠానాలు, హవనం, పవిత్ర జల ప్రోక్షణ, పూర్ణాహుతి, వేదాశీర్వచనం, నీరాజనం, మంత్రపుష్పం తదితర పూజా కార్యక్రమాలు వేదమంత్రోచ్చారణల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.