ప్రజా బాటలో విద్యుత్ సమస్యలపై ఆరా

రైతుల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశాలు

మహబూబ్‌నగర్ రూరల్, ఆంధ్రప్రభ: ట్రాన్స్‌కో సీఎండీ ఆదేశాల మేరకు అమలు చేస్తున్న ‘ప్రజా బాట – వాక్ అలాంగ్ ది లైన్’ కార్యక్రమంలో భాగంగా గురువారం కోడూరు సబ్‌స్టేషన్‌ను సూపరింటెండింగ్ ఇంజినీర్ భీమా నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా, నిర్వహణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం అక్కడికి వచ్చిన రైతులతో సమావేశమై గ్రామాల వారీగా ఎదురవుతున్న లో వోల్టేజ్, విద్యుత్ అంతరాయాలు, ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యలు తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రైతులు ప్రస్తావించిన సమస్యలపై స్పందించిన ఎస్‌ఈ భీమా నాయక్, వాటి పరిష్కారానికి అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి గ్రామానికి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.

కార్యక్రమంలో ఏఈ నర్సిరెడ్డి, డి. సంతోష్ కుమార్, స్థానిక విద్యుత్ శాఖ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.