సంగారెడ్డిలో సీఎం చేతుల మీదుగా ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల రేషన్ కార్డుల పంపిణీ
స్వాతంత్ర్య దినోత్సవాన భారీ పంపిణీ
కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం
రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ
119 నియోజకవర్గాల్లో ఒకేసారి పంపిణీ
హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కొత్తగా మంజూరైన ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) రేషన్ కార్డుల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల లామినేట్ చేసిన కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ గురువారం అధికారిక మెమో జారీ చేసి జిల్లా యంత్రాంగానికి మార్గదర్శకాలు పంపింది.
రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని సంగారెడ్డిలో నిర్వహించనుండగా, ముఖ్యమంత్రి అధికారికంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు సమక్షంలో పంపిణీ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రతి నియోజకవర్గంలో రెవెన్యూ డివిజనల్ అధికారి సమన్వయంతో జిల్లా యంత్రాంగం, పౌర సరఫరాల శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
స్వాతంత్ర్య దినోత్సవ అధికారిక వేడుకలు ఉదయం, రాజ్‌భవన్‌లో జరిగే ‘అట్ హోమ్’ కార్యక్రమం సాయంత్రం ఉండటంతో రేషన్ కార్డుల పంపిణీని మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కార్యక్రమం సజావుగా జరిగేలా అన్ని జిల్లాలు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది.
లబ్ధిదారుల జాబితాల తుది పరిశీలన, రేషన్ కార్డుల ముద్రణ, భద్రత, రవాణా, ప్రజాప్రతినిధులు–అధికారుల సమన్వయం, వేదికలు, తాగునీరు, కూర్చోవడానికి ఏర్పాట్లు, నమోదు–ధ్రువీకరణ ప్రక్రియ, మీడియా కవరేజ్, ప్రచారం, తగిన సిబ్బంది నియామకం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మెమోలో పేర్కొంది. కార్యక్రమం పూర్తైన అనంతరం పంపిణీ వివరాలతో సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని కూడా ఆదేశించింది.
కొత్తగా అర్హత పొందిన కుటుంబాలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రయోజనాలు అందేలా ఈ భారీ పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం కీలక సంక్షేమ కార్యక్రమంగా భావిస్తోంది. జిల్లా యంత్రాంగం సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
