‘ప్రజా బాట’లో విద్యుత్ సరఫరాపై సమీక్ష
మహబూబ్‌నగర్ రూరల్, ఆంధ్రప్రభ: ట్రాన్స్‌కో సీఎండీ ఆదేశాల మేరకు అమలు చేస్తున్న ‘ప్రజా బాట – వాక్ అలాంగ్ ది లైన్’ కార్యక్రమంలో భాగంగా కోడూరు విద్యుత్ సబ్‌స్టేషన్‌ను దక్షిణ వలయ సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ) భీమా నాయక్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి మంగళ, గురువారాల్లో నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా, నిర్వహణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా సబ్‌స్టేషన్‌కు వచ్చిన రైతులతో సమావేశమైన ఎస్ఈ భీమా నాయక్ గ్రామాల్లో నెలకొన్న లో ఓల్టేజ్, విద్యుత్ అంతరాయాలు, ట్రాన్స్ఫార్మర్ల సమస్యలు తదితర అంశాలపై ఆరా తీశారు. రైతులు ప్రస్తావించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే శాఖ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో ఏఈ సంతోష్ కుమార్, ఏఈ నర్సిరెడ్డి, విద్యుత్ శాఖ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
