కోటగండి మైసమ్మకు బంగారు బోనమెత్తిన కొండా

  • వంచనగిరి నుంచి 2 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి ప్రత్యేక పూజలు

గీసుకొండ, ఆంధ్రప్రభ : వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ప్రసిద్ధ కోటగండి కోటమైసమ్మ అమ్మవారి బోనాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దంపతులు అమ్మవారికి బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వంచనగిరి గ్రామం నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరం చెప్పులు లేకుండా కాలినడకన భక్తులతో కలిసి ఆలయానికి చేరుకున్న మంత్రి కొండా సురేఖ.. బంగారు బోనాన్ని సమర్పించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంత్రి వెంట మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, కుమార్తె సుస్మితా పటేల్, మనవరాలు శ్రేష్టా పటేల్, అల్లుడు అభిలాష్‌తో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు. దీంతో కోటగండి ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోయి జాతర వాతావరణాన్ని తలపించింది.

ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని కోటమైసమ్మ అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. భద్రకాళి అమ్మవారి బోనాలను వైభవంగా నిర్వహించాలని భావించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఆ కార్యక్రమం నుంచి వెనక్కి తగ్గాల్సి వచ్చిందని చెప్పారు.

మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మాట్లాడుతూ.. కోటమైసమ్మ తల్లిపై తనకు అపారమైన భక్తి ఉందని, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.