బూధవాడలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం
- గ్రామస్తులతో మమేకమైన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్
- రూ.30 లక్షలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ ప్రారంభం
- అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే
అద్దంకి, ఆంధ్రప్రభ: ప్రకాశం జిల్లా జె. పంగులూరు మండలం బూధవాడ గ్రామంలో నిర్వహించిన ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం.. ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను నేరుగా కలుసుకుని కూటమి ప్రభుత్వం రెండేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై వివరించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా గ్రామంలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ను ఎమ్మెల్యే ప్రజలకు అంకితం చేశారు. ఈ కమ్యూనిటీ హాల్ సామాజిక, సాంస్కృతిక, కుటుంబ కార్యక్రమాల నిర్వహణకు గ్రామ ప్రజలకు ఉపయోగపడేలా నిర్మించామని తెలిపారు. ముఖ్యంగా ఎస్సీ వర్గాలకు చెందిన కుటుంబాలకు శుభకార్యాలు, సమావేశాలు, ఇతర సామాజిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇది శాశ్వత వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. సంక్షేమ పథకాల అమలుతో పాటు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ రహదారులు, కమ్యూనిటీ భవనాలు, తాగునీటి సౌకర్యాలు, ఇతర ప్రజావసర పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా పారదర్శకంగా పాలన సాగుతోందని పేర్కొన్నారు.
‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం ద్వారా ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకుంటున్నామని, ప్రజల సూచనలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
