కేసీసీబీకి ప్రతిష్ఠాత్మక ‘రికగ్నిషన్ ఆఫ్ ఎక్సలెన్స్’ అవార్డు

  • రూ.15 వేల కోట్లకుపైగా వ్యాపారంతో అత్యుత్తమ పనితీరుకు గుర్తింపు
  • ఏపీకాబ్ ఫార్మేషన్ డే వేడుకల్లో అవార్డు ప్రదానం
  • అవార్డు స్వీకరించిన చైర్మన్ నెట్టెం రఘురాం
  • సమిష్టి కృషితోనే ఈ ఘనత సాధ్యమైంది
  • చైర్మన్ నెట్టెం రఘురాం

విజయవాడ, ఆంధ్రప్రభ: సహకార బ్యాంకింగ్ రంగంలో మరోసారి తన సత్తా చాటిన కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) ప్రతిష్ఠాత్మక “రికగ్నిషన్ ఆఫ్ ఎక్సలెన్స్” అవార్డును సొంతం చేసుకుంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.15 వేల కోట్లకు పైగా వ్యాపారం నమోదు చేసి అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు ఈ అవార్డును అందుకుంది.

అవార్డు అందుకున్న చైర్మన్ నెట్టెం రఘురాం..

విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ (ఏపీకాబ్) ఫార్మేషన్ డే వేడుకల్లో రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ (ఆర్‌సీఎస్), సహకార శాఖ కార్యదర్శి బాబు.ఏ, ఐఏఎస్, ఏపీకాబ్ చైర్మన్ గన్నె వీరాంజనేయులు, మేనేజింగ్ డైరెక్టర్ వి. రామకృష్ణ చేతుల మీదుగా కృష్ణా డీసీసీబీ చైర్మన్, మాజీ మంత్రి నెట్టెం శ్రీ రఘురాం ఈ అవార్డును అందుకున్నారు.

సమిష్టి కృషి ఫలితమే..

అవార్డు స్వీకరించిన అనంతరం నెట్టెం రఘురాం మాట్లాడుతూ, కృష్ణా డీసీసీబీ డైరెక్టర్ల మండలి, సీఈఓ, అధికారులు, ఉద్యోగులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్) ప్రతినిధులు, సభ్య రైతుల సమిష్టి కృషి ఫలితంగానే ఈ అరుదైన గౌరవం దక్కిందన్నారు. రైతులకు మరింత నాణ్యమైన, పారదర్శకమైన, సాంకేతిక ఆధారిత బ్యాంకింగ్ సేవలు అందిస్తూ సహకార రంగంలో కృష్ణా డీసీసీబీని దేశంలోనే అగ్రగామి సంస్థగా తీర్చిదిద్దేందుకు కృషి కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని 13 జిల్లాల డీసీసీబీ చైర్మన్లు, కృష్ణా డీసీసీబీ సీఈఓ శ్యామ్ మనోహర్, బ్యాంకు ఉన్నతాధికారులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.