హాస్టల్‌లో విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే రాత్రి బస
దామరచర్ల గురుకులంలో ఆకస్మిక తనిఖీ
మౌలిక వసతుల పరిశీలన.. సమస్యలు పరిష్కరిస్తానని హామీ
మిర్యాలగూడ (ఆంధ్రప్రభ): నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ గురుకుల పాఠశాల హాస్టల్‌ను మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. హాస్టల్‌లో విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులను క్షుణ్ణంగా పరిశీలించి, భోజనం, వసతి, పరిశుభ్రత తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
విద్యార్థుల సంక్షేమానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తానని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఆయన, హాస్టల్‌లోనే రాత్రి బస చేసి వారి దైనందిన జీవన విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందికి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
