నిరుపేదలకు అన్నా క్యాంటీన్లు వరం: మంత్రి నాదెండ్ల మనోహర్
- దెందులూరులో అన్నా క్యాంటీన్, ప్రత్యేక నాణ్యమైన బియ్యం విక్రయ కేంద్రం ప్రారంభం
- ప్రజలతో కలిసి భోజనం చేసిన మంత్రి, ప్రజాప్రతినిధులు
ఏలూరు/దెందులూరు, ఆంధ్రప్రభ: పేదలు, కార్మికులు, విద్యార్థులు, చిరువ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలకు అన్నా క్యాంటీన్లు వరంగా మారాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, ఏలూరు జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. దెందులూరు గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్‌తో పాటు ప్రత్యేక నాణ్యమైన బియ్యం విక్రయ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, బడేటి రాధాకృష్ణయ్య (చంటి), పత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించిందన్నారు. కేవలం రూ.15కే రోజుకు మూడు పూటల భోజనం అందించడం కూటమి ప్రభుత్వ ప్రత్యేకత అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ తక్కువ ధరలో పరిశుభ్రమైన, పోషకాహారం అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు.
అన్నా క్యాంటీన్లు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని, ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. క్యాంటీన్లలో అందించే ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత విషయంలో అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.
తక్కువ ధరకు నాణ్యమైన బియ్యం
నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు.
జిల్లాలో ఇప్పటికే 31 ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు మరో 29 కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఈ కేంద్రాల ద్వారా సూపర్ ఫైన్ బియ్యం కిలో రూ.52, బీపీటీ స్టీమ్ బియ్యం కిలో రూ.52, బీపీటీ రా బియ్యం కిలో రూ.50 చొప్పున విక్రయిస్తున్నట్లు తెలిపారు.
బియ్యం కొనుగోలు చేసే ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా ఆధార్ నంబర్ నమోదు చేయాలని, ప్రతి రేషన్ కార్డుకు గరిష్టంగా 10 కిలోల బియ్యం మాత్రమే విక్రయిస్తామని చెప్పారు. మార్కెట్ ధరల కంటే తక్కువకే నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి పేర్కొన్నారు.
ప్రజలతో కలిసి భోజనం
అన్నా క్యాంటీన్ ప్రారంభం అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, బడేటి రాధాకృష్ణయ్య (చంటి), పత్సమట్ల ధర్మరాజు ప్రజలతో కలిసి భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సి.హెచ్. శ్రావణ్ కుమార్ రెడ్డి, డీఎస్ఓ ఇ. బాబు విలియమ్స్, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
