ప్రభుత్వ శాఖలన్నింటిలో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేయాలి

ప్రజా సేవల్లో పారదర్శకత పెంచాలని రాఘవేందర్ యాదవ్ సూచన

మునుగోడు, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తప్పనిసరిగా అమలు చేసి ప్రజా సేవల్లో పారదర్శకత తీసుకురావాలని గ్లోబల్ అగ్రి ఇన్నోవేటివ్ రీసెర్చ్ ఫార్మ్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాఘవేందర్ యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు.

మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ప్రజల అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం వివిధ శాఖలను ఏర్పాటు చేసినప్పటికీ, కొన్ని కార్యాలయాల్లో సమయపాలన లోపించడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

ప్రజలు చెల్లించే పన్నులతోనే ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు చెల్లిస్తున్నందున, వారికి సకాలంలో సేవలు అందించడం ప్రతి ఉద్యోగి బాధ్యత అని పేర్కొన్నారు.

గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని ప్రభుత్వ శాఖల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేస్తే ఉద్యోగుల హాజరు, విధి నిర్వహణలో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు.

సంబంధిత శాఖల వెబ్‌సైట్లలో అధికారులు, ఉద్యోగుల వివరాలు, ఫోన్ నంబర్లతో పాటు హాజరు వివరాలను కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ విధానం అమలైతే ప్రజలకు మెరుగైన సేవలు అందడంతో పాటు తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొంటూ ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.