టెట్ పరీక్షలకు సర్వం సిద్ధం!
- 5 నుండి 16వ తేదీ వరకు పరీక్షలు
- జిల్లా విద్యాశాఖాధికారి రామారావు
పల్నాడు ప్రతినిధి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్-2026) ఈనెల 5 నుండి 16వ తేదీ వరకు నిర్వహించనున్న నేపథ్యంలో పల్నాడు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి.వి.జె. రామారావు తెలిపారు. జిల్లాలో 5 పరీక్షా కేంద్రాలలో మొత్తం 9,194 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.
కేంద్రాల వారీగా నరసరావుపేట ఇంజినీరింగ్ కళాశాల-1,704, నరసరావుపేట ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-1,867, ఏ.ఎం. రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల- 4,334, తిరుమల ఇంజినీరింగ్ కళాశాల-1,420, ఎం.పి.ఎం. కళాశాల-310 మంది పరీక్ష రాయనున్నారు. పరీక్షా కేంద్రాలలో తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, భద్రత, వైద్యసేవలు, సీసీ కెమెరాలు తదితర అన్ని మౌలిక సదుపాయాలు కల్పించినట్లు ఆయన తెలిపారు.
పరీక్షల నిర్వహణకు అవసరమైన అధికారులకు, సిబ్బందికి ఇప్పటికే విధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈసారి ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు కూడా టెట్ పరీక్షకు హాజరవుతున్నందున, ఎలాంటి ఆందోళన చెందకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయాలని సూచించారు.
పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9.30 నుండి 12.00 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు నిర్వహించబడతాయి. అభ్యర్థులను ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు, మధ్యాహ్నం 1.30 నుండి 2.30 గంటల వరకు మాత్రమే కేంద్రాలలోకి అనుమతిస్తారు. నిర్ణీత సమయం దాటిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమన్నారు.
అభ్యర్థులు హాల్ టికెట్, చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని, దివ్యాంగ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రత్యేక సౌకర్యాలు, 50 నిమిషాల అదనపు సమయం కల్పించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులందరూ పరీక్షా కేంద్రాలకు కనీసం గంట ముందుగానే చేరుకుని, ప్రశాంతంగా పరీక్షలు రాసి విజయవంతం కావాలని జిల్లా విద్యాశాఖాధికారి రామారావు ఆకాంక్షించారు.
