చట్ట వ్యతిరేక చైల్డ్ కేర్ సంస్థలపై కఠిన చర్యలు..

  • కలెక్టర్ చదలవాడ నాగరాణి

భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : చట్ట వ్యతిరేకంగా, రిజిస్ట్రేషన్ లేకుండా నిర్వహిస్తున్న చైల్డ్ కేర్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూట్‌లకు రిజిస్ట్రేషన్ల పొడిగింపు, మంజూరు చేసేందుకు జిల్లా స్థాయి సిఫార్సు కమిటీ సమావేశంపై నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె సంబంధిత శాఖ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లాలో జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ, రక్షణ) చట్టం, 2015 నిబంధనలను ఉల్లంఘిస్తూ, ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్న చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు.

0 నుండి 18 సంవత్సరాల వయస్సు గల అనాథలు, వీధి పిల్లలు, బాల కార్మికులు, వేధింపులకు గురైన పిల్లలు, చట్టపరమైన కేసుల్లో చిక్కుకున్న బాలల రక్షణే ధ్యేయంగా ఎప్పటికప్పుడు సంబంధిత శాఖ అధికారులు సమన్వయంతో తనిఖీలు నిర్వహించాలన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలను గుర్తించి వారికి ఒక రిజిస్టర్ సిద్ధం చేసి వారి పూర్తి వివరాలు ఎక్కడ నివసిస్తున్నారు, ఎవరి సంరక్షణలో ఉన్నారు, అనే వివరాలను రిజిస్టర్ లో పొందుపరచడంతో వారి జాడను కనుగొనే అవకాశం దొరుకుతుందని వారు ఎటువంటి హ్యూమన్ ట్రాఫిక్ చేతుల్లో పడకుండా సంరక్షించుకునే అవకాశం ఉంటుందని ఆమె అన్నారు.

జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తాజా సమీక్ష ప్రకారం, మొత్తం 12 బాలల సంరక్షణ సంస్థలకు మాత్రమే తుది రిజిస్ట్రేషన్ లభించిందని. ఇందులో 11 చిల్డ్రన్ హోమ్స్ (10 స్వచ్ఛంద సంస్థలు, 1 ప్రభుత్వ హోమ్) మరియు ఒక ప్రభుత్వ ప్రత్యేక దత్తత సంస్థ ఉన్నాయి. కాగా, నిబంధనల ఉల్లంఘనలు, జేజే చట్టం పరిధిలోకి రాకపోవడం వల్ల జిల్లాలోని మరో 11 సంస్థలను కమిటీ తిరస్కరించిందన్నారు. నరసాపురం పరిధిలో రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్న రెండు సంస్థలపై ప్రత్యేక నిఘా పెట్టడం జరిగిందన్నారు. ఫెయిత్ విజన్ చిల్డ్రన్స్ హోమ్ లో మొత్తం 9 మంది పిల్లలు ఉండగా వారిలో 6 గురు బాలికలు, 3 గురు బాలురుగా ఉన్నారని వివరించారు.

వీరిలో కృష్ణా జిల్లాకు చెందిన వారు ఐదుగురు, తెలంగాణకు చెందిన వారు ఇద్దరు ఉన్నారని తెలిపారు. కాథ్లీన్ హోమ్ ఫర్ ఆర్ఫన్స్ అండ్ విడోస్ సంస్థలో మొత్తం 63 మంది పిల్లలు ఉండగా వారిలో 25 మంది బాలికలు, 38 మంది బాలురు ఆశ్రయం పొందుతున్నారు. వీరిలో తూర్పు గోదావరి నుండి ముగ్గురు, కృష్ణా జిల్లా నుండి ఇద్దరు, యానాం నుండి ఒకరు ఉన్నారని వివరించారు.

సదరు సంస్థల నిర్వాహకులు జేజే చట్టం కింద రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నిరాకరిస్తున్న నేపథ్యంలో, జేజే చట్టం సెక్షన్ 31, రూల్ 18 ప్రకారం ఆయా సంస్థల్లోని పిల్లలందరినీ తక్షణమే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రవేశపెట్టి, వారికి సురక్షిత ప్రాంతాలలో వసతి కల్పించాలని ఆదేశించడం జరిగిందని, చట్ట నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు.

నిబంధనలకు విరుద్ధంగా ఉన్న జిల్లాలో నాలుగు పిల్లల సంరక్షణ ఇన్‌స్టిట్యూట్‌ లను మూసివేసామని ఆమె వివరించారు. జిల్లాలో అన్ని రకాల నిబంధనలు పాటించి, తనిఖీలలో ఎటువంటి ప్రతికూల నివేదికలు లేని ది సాల్వేషన్ ఆర్మీ , గాడ్స్ చిల్డ్రన్ హోమ్ చైల్డ్ కేర్ సంస్థలకు తుది రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మంజూరు చేయాలని కమిటీ సిఫార్సు చేసిందని ఆమె తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్ కల్పశ్రీ, ఏ ఎస్ పి డి విశ్వనాథ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఏవో పి విజయలక్ష్మి, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడి బి రామ్ కుమార్, సి డబ్ల్యూ సి చైర్పర్సన్ పి వెంకటేశ్వరరావు, జె జె బి మెంబర్ డి పద్మ, జిల్లా బాలల సంరక్షణ అధికారి పి రాజేష్, సంస్థాగత సంరక్షణ, రక్షణాధికారి డి సి పి యు పి మమతా శ్రీ, డీఎస్సీడబ్ల్యు ఈవో ఎన్ వై అరుణకుమారి, డి ఎస్ టి డబ్ల్యూ ఈవో డి పుష్ప రాణి, డీఈవో ఈ నారాయణ, జాయింట్ సబ్ రిజిస్టర్ భీమవరం టి ప్రసాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు.