కాకతీయుల ఆనవాళ్లకు కొత్త భరోసా..

శనిగరం శివాలయంపై దృష్టి

ఆలయ అభివృద్ధితో పాటు మాన్యం భూముల పరిరక్షణకు కృషి చేస్తా: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చత్రాత్

నల్లబెల్లి, ఆంధ్రప్రభ : కాకతీయుల శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచిన శనిగరం గ్రామంలోని ప్రాచీన శివాలయం మరోసారి చర్చనీయాంశమైంది. శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న ఈ ఆలయాన్ని హర్యానా క్యాడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చత్రాత్ మంగళవారం సందర్శించారు.

ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ శైలి, కాకతీయుల శిల్పకళా నైపుణ్యం, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను ఆయన పరిశీలించి ప్రశంసించారు. గ్రామ సర్పంచ్ ఉట్కూరి అశోక్ ఆలయ చరిత్ర, ప్రత్యేకతలను చత్రాత్‌కు వివరించారు.

శనిగరం గ్రామపంచాయతీ రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ ఆలయం కాకతీయుల కాలంలో నిర్మితమైందని, నేటికీ అద్భుతమైన శిల్ప సంపదకు సాక్ష్యంగా నిలుస్తోందని తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం గతంలో గ్రామపంచాయతీ తరఫున వరంగల్ పురావస్తు శాఖకు, నల్లబెల్లి మండల తహసీల్దార్ కార్యాలయానికి వినతిపత్రాలు సమర్పించిన విషయాన్ని గుర్తు చేశారు.

చత్రాత్ మాట్లాడుతూ చారిత్రక వారసత్వ సంపదను కాపాడటం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధితో పాటు ఆలయానికి సంబంధించిన మాన్యం భూముల పరిరక్షణ, పునరుద్ధరణ అంశాలను జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు చేపట్టేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉట్కూరి అశోక్, పంచాయతీ కార్యదర్శి బి. మధు, జీపీఓ పైడయ్య, గొల్లపల్లి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

కాకతీయుల కళా వైభవానికి ప్రతీకగా ఉన్న శనిగరం శివాలయానికి పురావస్తు శాఖ పరిరక్షణ కల్పించి, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆలయ పునరుద్ధరణతో పాటు మాన్యం భూములు పరిరక్షించబడితే చారిత్రక వారసత్వం నిలవడంతో పాటు గ్రామానికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.