అడవి పందులను తరలిస్తున్న బొలెరో పట్టివేత..

బాసర, ఆంధ్రప్రభ: బాసర గోదావరి వద్ద ఉన్న అటవీశాఖ చెక్‌పోస్ట్‌లో మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో అడవి పందులను అక్రమంగా తరలిస్తున్న బొలెరో వాహనాన్ని అటవీశాఖ అధికారులు పట్టుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి సిద్ధిపేటకు సుమారు 23 అడవి పందులను బొలెరో వాహనంలో తరలిస్తున్నట్లు గుర్తించిన అధికారులు వాహనంతో పాటు ఇద్దరినీ బైంసా అటవీశాఖ కార్యాలయానికి తరలించినట్లు డిప్యూటీ రేంజ్ అధికారి ఎం. శంకర్ తెలిపారు.

స్వాధీనం చేసుకున్న అడవి పందులకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వాటిని అటవీ ప్రాంతంలో వదిలివేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ఫారెస్ట్ బీట్ అధికారులు శివ, సంజయ్, చెక్‌పోస్ట్ వాచర్లు సద్దాం, నరేంద్ర, అనిమల్ ట్రాకర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.