రైతు బజారులో నాణ్యమైన బియ్యం..

  • పెడన రైతు బజార్‌లో తగ్గింపు ధరలకు నాణ్యమైన బియ్యం విక్రయాల స్టోర్ ప్రారంభం

పెడన, ఆంధ్రప్రభ : పెడన రైతు బజార్‌లో పెరుగుతున్న బియ్యం ధరల నేపథ్యంలో సామాన్య ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బియ్యం విక్రయాల కౌంటర్‌ను పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలపై పెరుగుతున్న బియ్యం ధరల భారం తగ్గించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మిల్లర్ల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు.

పెడన రైతు బజార్‌లో వినియోగదారులకు నాణ్యమైన స్టీమ్ బియ్యం (బి.పి.టి.) కిలో రూ.52/-కు, రా బియ్యం (బి.పి.టి.) కిలో రూ.50/-కు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

అనంతరం రైతు బజార్‌ను ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పూర్తిగా పరిశీలించారు. రైతులు, వ్యాపారులు, వినియోగదారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతు బజార్‌లో విక్రయిస్తున్న కూరగాయల నాణ్యతను పరిశీలించి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులు, అవసరాలను తెలుసుకున్నారు.

రైతులకు గిట్టుబాటు ధర, ప్రజలకు నాణ్యమైన కూరగాయలు, నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండేలా రైతు బజార్ల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే సూచించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన బియ్యం అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది.