జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

  • ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం
  • ముండ్లమూరులో నిర్వహించిన ‘మీకోసం’ గ్రీవెన్స్ కార్యక్రమంలో విజ్ఞప్తి

ముండ్లమూరు, ఆంధ్రప్రభ: జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో దర్శి నియోజకవర్గ జర్నలిస్టులు అధికారులకు వినతిపత్రం అందజేశారు.

ముండ్లమూరు మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ‘మీకోసం’ గ్రీవెన్స్ కార్యక్రమం సందర్భంగా ఈ వినతిపత్రాన్ని అందించారు. జర్నలిస్టుల దినోత్సవం సందర్భంగా దర్శి నియోజకవర్గంలోని విలేకరులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పన, దర్శి టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిలకు వినతిపత్రం సమర్పించి, జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన సమస్యలను వివరించారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.

అనంతరం నిర్వహించిన ‘మీకోసం’ గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, దర్శి టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి స్వీకరించారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, టీడీపీ యువ నాయకుడు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి–సుబ్బారావు, ఏఎంసీ వైస్ చైర్మన్ కోడిగ మస్తాన్‌రావు, తెల్లయ్య, వరగాని పౌలు, నాగరాజు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.