ఆన్‌లైన్ గేమింగ్ మోసం బట్టబయలు..
కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో అమాయక ప్రజలను పెట్టుబడుల పేరుతో మోసం చేస్తున్న ఇద్దరు నిందితులను రామారెడ్డి పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల వద్ద నుంచి రూ.15 వేల నగదు, ఒక ల్యాప్‌టాప్, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర వెల్లడించారు.
వాట్సాప్ ద్వారా ఆన్‌లైన్ గేమింగ్ లింకులు పంపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు రామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో కామారెడ్డి రూరల్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రామన్, రామారెడ్డి ఎస్‌ఐ మురళి నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారాన్ని విశ్లేషిస్తూ గాలింపు చేపట్టి నిందితులను పట్టుకున్నారు.
దర్యాప్తులో భాగంగా కామారెడ్డి బస్టాండ్ వద్ద విశాఖపట్నం వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రధాన నిందితుడు భూక్యా నవీన్ అలియాస్ నరేష్ విదేశాల్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో Future9.com అనే ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్‌కు సంబంధించిన వివరాలు, మొబైల్ నంబర్ల డేటాను సేకరించినట్లు అంగీకరించాడు.
భారతదేశానికి తిరిగి వచ్చిన అనంతరం వాట్సాప్ ద్వారా పలువురికి ఆన్‌లైన్ గేమింగ్ లింకులు పంపించి, “పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయి” అని నమ్మించి మోసాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. బాధితులకు యూజర్ ఐడీలు సృష్టించి వెబ్‌సైట్‌లో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించేవారని, వెబ్‌సైట్‌లో నేరుగా చెల్లింపులు జరగని సందర్భాల్లో తమ యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా నగదు స్వీకరించి సంబంధిత వెబ్‌సైట్‌లో జమ చేసేవారని పోలీసులు తెలిపారు. ఇందుకు ప్రతిఫలంగా వారికి ఐదు శాతం కమిషన్ అందినట్లు దర్యాప్తులో తేలింది. ప్రాథమిక విచారణలో ఈ వెబ్‌సైట్ ద్వారా దేశవ్యాప్తంగా అనేక మంది మోసపోయినట్లు గుర్తించారు.
అరెస్టైన నిందితులు భూక్యా నవీన్ అలియాస్ నరేష్, భూక్యా ప్రవీణ్ ఇద్దరూ రామారెడ్డి మండలానికి చెందినవారని ఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి ఒక ల్యాప్‌టాప్, నాలుగు మొబైల్ ఫోన్లు, రూ.15 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయని, కేసుపై మరింత లోతుగా దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు.
ఈ కేసును ఛేదించడంలో విశేష కృషి చేసిన కామారెడ్డి రూరల్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రామన్, రామారెడ్డి ఎస్‌ఐ మురళి, సైబర్ క్రైమ్ ఎస్‌ఐ నరేష్‌తో పాటు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
ప్రజలకు ఎస్పీ సూచనలు
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ, ఆన్‌లైన్ గేమింగ్, పెట్టుబడులు, ట్రేడింగ్, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, క్యాష్‌బ్యాక్, రెట్టింపు లాభాలు వంటి పేర్లతో వాట్సాప్, టెలిగ్రామ్, సోషల్ మీడియా ద్వారా వచ్చే గుర్తుతెలియని లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని సూచించారు. తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని చెప్పే వెబ్‌సైట్లు, యాప్‌లను గుడ్డిగా నమ్మి నగదు పంపడం వల్ల భారీ ఆర్థిక నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు.
ఆన్‌లైన్ మోసాలకు గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని లేదా www.cybercrime.gov.inలో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. అలాగే సమీప పోలీస్ స్టేషన్‌లో వెంటనే ఫిర్యాదు చేస్తే, సకాలంలో చర్యలు తీసుకుని బాధితులు కోల్పోయిన నగదును నిలిపివేసి తిరిగి పొందే అవకాశాలు మెరుగవుతాయని ఎస్పీ తెలిపారు.
