కేంద్ర మంత్రిని కలిసిన తెలంగాణ బీజేపీ ఎంపీల బృందం..!

ఇందిరమ్మ గృహాల అంశంపై లోతుగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ

ఆంధ్రప్రభ బ్యూరో ఉమ్మడి ఆదిలాబాద్ : గిరిజన జనాభా అధికంగా ఉండి షెడ్యూల్డ్ ఏరియాగా నోటిఫై కాని మారుమూల గ్రామాలకు పి ఎం జి ఎస్ వై రహదారులు విస్తరించాలని బిజెపి తెలంగాణ పార్లమెంట్ సభ్యులు కేంద్రానికి విన్నవించారు. ఈ మేరకు శుక్రవారం తెలంగాణకు చెందిన బిజెపి ఎంపీలు కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చవాన్ ను కలిసి మారుమూల గ్రామీణ ప్రాంతాలకు రోడ్ల సౌకర్యం విస్తరించాలని, రాష్ట్రానికి కేంద్రం నుండి నిధుల వాటా పెంచాలని కోరారు.

ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ కేంద్రమంత్రికి వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన (పి ఎం జి ఎస్ వై) పథకాన్ని షెడ్యూల్డ్ గ్రామంగా నోటిఫై కాకున్నా 100 శాతం గిరిజన జనాభా నుండి, మొత్తం 250 జనాభా కలిగిన గ్రామాలకు విస్తరించేలా నిబంధనలు సడలించాలని కోరారు. ఎందుకు మంత్రి సానుకూలంగా స్పందించి ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చినట్టు ఎంపీ నగేష్ తెలిపారు.

ఇందిరమ్మ గృహాలకు ఆవాస్ యోజన నిధులు ఇవ్వొద్దు..!

తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ గృహాల మంజూరు లో బిజెపి ఎంపీలు ఎమ్మెల్యేలకు ప్రాతినిధ్యం లభించడం లేదని తెలంగాణ ఎంపీలు కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. ముఖ్యంగా అర్హులైన పేదల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

కేంద్రం ఇచ్చే నిధులను ఇందిరమ్మ గృహాలకు దారి మళ్ళిస్తున్నారని, అర్హులైన పేదలకు ఆవాస్ యోజన పథకం వర్తింపజేయడం లేదని ఎంపీలు పేర్కొన్నారు. ఇందిరమ్మ గృహాల నిర్మాణం పూర్తయిన తర్వాత మూడు రంగులు వేసి కాంగ్రెస్ ప్రభుత్వమే గొప్పలు గా చెప్పుకుంటుందని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పేదల గృహాలకు ఆవాస్ యోజన అమలు చేస్తామని, ఇందిరమ్మ గృహాల అంశంపై లోతుగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్టు ఎంపీలు తెలిపారు.

అంతేగాక ప్రభుత్వం నిర్మించే గృహానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన లోగో ఉంటేనే నిధులు కేటాయిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చినట్టు ఎంపీ నగేష్ తెలిపారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులు, ఎంపీ గోడెం నగేష్ తోపాటు డీ.కే అరుణ, ఈటల రాజేందర్ , రఘునందన్ రావ్ , కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితర బృందం సభ్యులు పాల్గొన్నారు.