శిథిలావస్థలోని ఇళ్లను ఖాళీ చేయాలి

మున్సిపల్ కమిషనర్ గజానంద్

భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : వర్షాకాలంలో ప్రజల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా భీమ్‌గల్ మున్సిపాలిటీ పరిధిలోని శిథిలావస్థలో ఉన్న ఇళ్లను మున్సిపల్ అధికారులు శుక్రవారం పరిశీలించారు. ప్రమాదకర స్థితిలో ఉన్న భవనాల యజమానులకు వెంటనే ఇళ్లను ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పాత, శిథిలావస్థలో ఉన్న భవనాలు ఎప్పుడు కూలిపోతాయో చెప్పలేమని, అలాంటి ఇళ్లలో నివసించడం ప్రాణాపాయానికి దారితీసే అవకాశం ఉందన్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న కుటుంబాలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు.
ప్రజల ప్రాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మున్సిపాలిటీ తరఫున అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపడుతున్నామని కమిషనర్ తెలిపారు. ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించి అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.