నషా ముక్త్‌లో ఉరవకొండకు ప్రథమ బహుమతి..

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని యువ భారత్ నిర్వహించిన నషా ముక్త్ భారత్ జిల్లా స్థాయి రీల్/షార్ట్ వీడియో పోటీల్లో ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు జిల్లా ప్రథమ బహుమతిని సాధించి కళాశాలకు మరోసారి కీర్తి తీసుకొచ్చారు.

అనంతపురంలోని ఎస్‌ఎస్‌బీఎన్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన పోటీల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఐదో సెమిస్టర్ బీకాం (కంప్యూటర్ అప్లికేషన్స్) విద్యార్థులు మధు, నవీన్, సుంకన్న, పరశురామ్, పెద్దన్న కలిసి మాదకద్రవ్యాల వ్యసనం కుటుంబంపై చూపే దుష్ప్రభావాలు” అనే సామాజిక అంశాన్ని హృదయాలను కదిలించేలా రీల్ రూపంలో ఆవిష్కరించారు. వారి ప్రదర్శన న్యాయనిర్ణేతల ప్రశంసలు అందుకుని జిల్లా ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది.

ఈ అవగాహన రీల్‌కు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వాన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాల కంప్యూటర్ అప్లికేషన్స్ విభాగ అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ యూనిట్–1 కార్యక్రమ అధికారి మాసినేని సుధాకర్ అందించారు. యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ సందేశాత్మక వీడియో సామాజిక బాధ్యతను ప్రతిబింబిస్తూ విశేష ఆదరణ పొందింది.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి. శైలజారాణి మాట్లాడుతూ, విద్యార్థులు విద్యతో పాటు సామాజిక బాధ్యత కలిగిన అంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో ముందుండడం అభినందనీయమని అన్నారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ టి.ఎన్. మస్తానప్ప, ఎన్ఎస్ఎస్ కార్యక్రమ అధికారి ఎం. విష్ణుప్రియ, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది విజేతలను అభినందించి, రాష్ట్ర, జాతీయ స్థాయిలోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.