సమస్యలు పరిష్కరించండి..
మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి వినతి
రహదారులు, డ్రైనేజీ, వీధిదీపాల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డికి స్థానికుల విజ్ఞప్తి
మేడ్చల్, ఆంధ్రప్రభ : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ సర్కిల్ 297వ డివిజన్లో నెలకొన్న రహదారులు, డ్రైనేజీ, వీధిదీపాలు, పారిశుధ్య సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి స్థానికులు వినతిపత్రం అందజేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బి. భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, డివిజన్లోని పలు ప్రధాన రహదారులు, కాలనీల్లో పారిశుధ్యం అధ్వానంగా మారడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వినతిపత్రంలో ప్రధానంగా ఎస్హెచ్-44 నుంచి రైల్వే స్టేషన్ రోడ్ వరకు డ్రైనేజీ పనులు పూర్తి చేయడం, చేపల మార్కెట్ నుంచి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వరకు రహదారి, డ్రైనేజీ మరమ్మతులు, సూర్యనగర్, వినాయక్ నగర్ కాలనీల్లో డ్రైనేజీ సమస్యల పరిష్కారం, ముకుంద థియేటర్–రైల్వే స్టేషన్ రోడ్, బస్తీ టీచర్స్ కాలనీ రహదారి పునర్నిర్మాణం, గిర్మాపూర్–హనుమాన్ ఆలయం వరకు సీసీ రోడ్డు, ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రైలాపూర్ వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు.
అలాగే గ్రంథాలయ భవనం నుంచి ప్రభుత్వ ఆసుపత్రి, ఇందిరానగర్ కాలనీ వరకు డ్రైనేజీ పైప్లైన్ పనుల కోసం తవ్విన రహదారిని వెంటనే పునరుద్ధరించాలని, వర్షపు నీటితో గుంతలుగా మారిన ఈ రహదారిపై ప్రయాణం ప్రమాదకరంగా మారిందని పేర్కొన్నారు. ఇదే రహదారి ప్రభుత్వ ఆసుపత్రికి, పాఠశాల బస్సులకు, గర్భిణులు, అత్యవసర వైద్య సేవలకు ప్రధాన మార్గమని గుర్తు చేశారు.
గిర్మాపూర్, రైలాపూర్, రైల్వే కాలనీ, మేడ్చల్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో వీధిదీపాలు పనిచేయడం లేదని, బస్ డిపో పరిసరాల్లో పారిశుధ్య పరిస్థితులు దయనీయంగా ఉన్నాయని తెలిపారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతిరోజూ ఈ మార్గంలో ప్రయాణిస్తున్నప్పటికీ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన స్థానికులు, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మల్లారెడ్డిని కోరారు.
