Drought-Crisis-El-Nino : భీక‌ర‌ తాండ‌వం Andhra Prabha Top Story

Drought-Crisis-El-Nino : భీక‌ర‌ తాండ‌వం Andhra Prabha Top Story

  • క‌ర‌వునేల‌లో ఎల్‌నినో ప్ర‌తాపం
  • పాతాళంలో గంగ‌మ్మ
  • 20 మీటర్ల లోతులో భూగర్భ జలం
  • తాగునీటికి క‌ట‌క‌ట
  • చెరువుల్లో జీవ య‌జ్ఙం
  • మంచినీటి స‌ర‌ఫ‌రాపైనే ప్ర‌త్యేక దృష్టి

( శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ)

శ్రీ సత్యసాయి జిల్లా గత ఏడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత తీవ్రమైన కరువు పరిస్థితులను ఎదుర్కొంటోంది. వరుసగా వర్షాలు విఫలమవడం, ఎల్‌నినో ప్రభావంతో సాధారణ వర్షపాతం నమోదుకాకపోవడం వల్ల జిల్లాలో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. ఇప్పటికే 32 మండలాల్లో 10 మండలాలు అత్యంత తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొంటుండగా, మడకశిర, రాప్తాడు నియోజకవర్గాల్లో పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. పెనుకొండలో బీసీ సంక్షేమ, చేనేత శాఖ మంత్రి సవిత అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో జిల్లా పరిస్థితులపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోందని అధికారులు వెల్లడించారు.

Drought-Crisis-El-Nino :పాతాళంలో గంగ‌మ్మ

జిల్లాలో సాధారణంగా భూగర్భ జలాలు సుమారు 17 మీటర్ల లోతులో లభించేవి. అయితే ప్రస్తుతం అవి 20 మీటర్ల లోతుకు పడిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అనేక ప్రాంతాల్లో బోర్లు ఎండిపోవడంతో రైతులు, గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ అవసరాలతో పాటు తాగునీటి అవసరాలను తీర్చడమే పెద్ద సవాలుగా మారింది. జిల్లాలో ప్రతి చదరపు కిలోమీటరుకు సగటున 26 బోర్లు ఉండటం కూడా భూగర్భ జలాలపై తీవ్ర ఒత్తిడికి కారణమైందని అధికారులు పేర్కొన్నారు. అధిక స్థాయిలో భూగర్భ జలాల వినియోగం, వర్షాభావం కలిసి నీటి మట్టం వేగంగా పడిపోవడానికి దోహదపడ్డాయి. చెరువులకు వర్షపు నీటిని చేరవేసే ప్రత్యేక ప్రణాళిక వర్షాలు కురిసిన వెంటనే ప్రతి నీటి బొట్టును నిల్వ చేయాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. జిల్లాలోని 258 చెరువులకు వర్షపు నీరు చేరేలా కాలువలను పునరుద్ధరిస్తున్నారు. అదేవిధంగా 78 కుంటలకు కూడా వర్షపు నీటిని మళ్లించే చర్యలు ప్రారంభించారు. ఈ పనుల్లో స్థానిక ప్రజాప్రతినిధులు కూడా చురుకుగా పాల్గొంటున్నారు. పెనుకొండ ప్రాంతంలో మంత్రి సవిత స్వయంగా పర్యవేక్షిస్తుండగా, కదిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని జేసీబీల సహాయంతో చెరువులకు అనుసంధాన కాలువల పనులను వేగవంతం చేస్తున్నారు. వర్షాలు వచ్చిన వెంటనే నీరు వృథా కాకుండా నిల్వ చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా అధికారులు తెలిపారు.

Drought-Crisis-El-Nino :తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి

కరువు తీవ్రత దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి కొరత ఏర్పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను మంత్రి సవిత ఆదేశించారు. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, ప్రత్యామ్నాయ బోర్ల ఏర్పాటు, గ్రామాల వారీగా నీటి పరిస్థితిపై నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ తాగునీరు, పశుగ్రాసం, వ్యవసాయ పరిస్థితులపై రోజువారీ సమీక్ష నిర్వహిస్తున్నారు.

Drought-Crisis-El-Nino : మడకశిర – రాప్తాడులోనే

జిల్లాలోని మడకశిర, రాప్తాడు నియోజకవర్గాల్లో కరువు ప్రభావం అత్యధికంగా కనిపిస్తోంది. వర్షాభావంతో సాగు పూర్తిగా దెబ్బతినగా, అనేక గ్రామాల్లో బోర్లు ఎండిపోయాయి. పశువులకు నీరు, మేత లభించడం కూడా కష్టంగా మారింది. రైతులు ఖరీఫ్ పంటలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Drought-Crisis-El-Nino :అస‌లే క‌ర‌వు.. పైగా ఎల్‌నినో

సమీక్ష సమావేశంలో మంత్రి సవిత మాట్లాడుతూ, ఈ పరిస్థితి కేవలం శ్రీ సత్యసాయి జిల్లాకే పరిమితం కాదన్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా సుమారు 175 దేశాలు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో వ్యవసాయం, తాగునీటి రంగాలపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. అయితే పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో పనిచేస్తోందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.

Drought-Crisis-El-Nino : సమన్వయం అనివార్యం

కరువు నివారణ చర్యల్లో రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, వ్యవసాయం, భూగర్భ జలాలు, నీటిపారుదల, పశుసంవర్ధక, తాగునీటి శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. గ్రామాల వారీగా పరిస్థితులను అంచనా వేసి ఎక్కడ సమస్య తీవ్రంగా ఉందో అక్కడ తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ ప్రత్యేక సమీక్ష సమావేశంలో మంత్రి సవితతో పాటు జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఎమ్మెల్యేలు కందికుంట వెంకటప్రసాద్, పల్లె సింధూర రెడ్డి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొని జిల్లాలో కరువు పరిస్థితులు, తాగునీటి నిర్వహణ, భూగర్భ జలాల పరిరక్షణ, చెరువుల పునరుద్ధరణ, రైతులకు అవసరమైన సహాయక చర్యలపై విస్తృతంగా చర్చించారు.
ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లాలో నెలకొన్న పరిస్థితులు ప్రభుత్వం, యంత్రాంగానికి పెద్ద సవాలుగా మారాయి. అయితే ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టే చర్యలు, తాగునీటి భద్రత, చెరువుల పునరుద్ధరణ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ప్రభుత్వం పనిచేస్తుండటం కొంత ఊరటనిచ్చే అంశంగా అధికారులు భావిస్తున్నారు.