జిల్లా జైలు నిర్మాణ స్థల పరిశీలన
యడ్లపాడు, ఆంధ్రప్రభ: పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలో ప్రతిపాదిత జిల్లా కారాగారం (జైలు) నిర్మాణానికి సంబంధించి జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా గురువారం స్థల పరిశీలన నిర్వహించారు.జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేయనున్న జిల్లా జైలుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా ప్రతిపాదిత భూములను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
భద్రతా ప్రమాణాలు, రవాణా సౌకర్యాలు,భూవిస్తీర్ణం,నీరు,విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలపై అధికారులతో సమీక్ష నిర్వహించి, అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు.జైలు నిర్మాణానికి అవసరమైన భూమి ఎంపికలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అన్ని సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు.
ఈ పరిశీలనలో నరసరావుపేట రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) బాలకృష్ణ, యడ్లపాడు తహసీల్దార్ విజయశ్రీతో ఆర్ఐ సుబ్బారావు మండల సర్వేయర్ సురేంద్రనాథ్ పాటు రెవెన్యూ శాఖ మరియు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
