ఆ దారిగుండా వెళ్లకండి!
ఉట్నూర్, ఆంధ్రప్రభ: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గంగాపూర్, ఎలక్షన్పేట గ్రామాలకు వెళ్లే మార్గాల్లో వాగులు ఉద్ధృతంగా ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద పరిస్థితుల నేపథ్యంలో ఉట్నూర్ తహసీల్దార్ కోట్నాక్ రఘునాథరావు, డిప్యూటీ తహసీల్దార్ అమృత్లాల్, పోలీసు అధికారులు వర్షంలోనే లో-లెవల్ వంతెనలు, వాగులను పరిశీలించారు. ప్రజలు వాగులను దాటే ప్రయత్నం చేయవద్దని, ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాగుల వద్ద భద్రతా ఏర్పాట్లు చేసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర పరిస్థితులు ఉంటే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని, అవసరం లేకపోతే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని తహసీల్దార్ రఘునాథరావు విజ్ఞప్తి చేశారు.
