ఉద్యోగాలు, ఫీజు బకాయిలపై సమాధానం చెప్పాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు
హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలో విద్యార్థుల సమస్యలు, ఉద్యోగాల భర్తీ, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల అంశాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు కాంగ్రెస్ పార్టీ, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందించిన ఆయన, తెలంగాణ యువతకు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.
ఉద్యోగాల భర్తీ కోసం యువత రోడ్డెక్కి ఆందోళన చేపడితే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి వారిపై లాఠీచార్జ్ చేయించిందని రాంచందర్రావు ఆరోపించారు. ఈ ఘటనలపై రాహుల్ గాంధీ స్పందించకపోవడం ఎందుకని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇప్పటికీ విడుదల కాలేదని ఆయన ఆరోపించారు. దీంతో విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని పేర్కొంటూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.
అలాగే, 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులపై జరిగిన కాల్పుల ఘటనకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ క్షమాపణ చెప్పలేదని, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం రెండో దశలో కాంగ్రెస్ వైఖరి కారణంగా సుమారు 1,200 మంది యువకులు, విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.
విశ్వవిద్యాలయ భూములను రియల్ ఎస్టేట్ అవసరాల కోసం వినియోగించే ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసిందని విమర్శించిన రాంచందర్రావు, కాంగ్రెస్కు విద్యార్థుల సంక్షేమంపై నిజమైన చిత్తశుద్ధి లేదని, వారిని కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని ఆరోపించారు.
