బంచరాయితండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
- రాంగ్‌రూట్‌లో వచ్చిన బొలెరో..
- యువకుడి మృతి..
- మరో యువకుడికి తీవ్ర గాయాలు..
- కేసు నమోదు చేసిన పోలీసులు
కురవి, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బంచరాయితండ సమీపంలోని బంగారిగూడెం క్రాస్‌రోడ్ వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బయ్యారం వైపు నుంచి మహబూబాబాద్ దిశగా వస్తున్న టీఎస్-08-యూజీ-4586 నంబరు గల కోళ్ల బొలెరో వాహనం రాంగ్‌రూట్‌లోకి వచ్చి, మహబూబాబాద్ నుంచి బయ్యారం వైపు వెళ్తున్న ఏపీ-39-ఈజే-6751 నంబరు గల ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన మల్లిడి సాయినాథ్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితో పాటు ప్రయాణిస్తున్న గంజి శివ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో అతని కుడికాలు విరిగిపోయినట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.
బుధవారం ఉదయం సుమారు 5.40 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఎస్సై సతీష్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
