Delhi | పారదర్శకతకు ప్రాధాన్యం..
- నీట్ యూజీ కౌన్సెలింగ్‌పై కేంద్రం ఫోకస్
- ఒక్కసారి మాత్రమే కాలేజీ రిపోర్టింగ్..
- ఆన్‌లైన్ ధ్రువపత్రాల పరిశీలనకు ప్రాధాన్యం
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : నీట్ (యూజీ)-2026 కౌన్సెలింగ్ సన్నాహకాలపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా అండర్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల ప్రవేశ ప్రక్రియను పారదర్శకంగా, ప్రతిభ ఆధారితంగా, సాంకేతికతతో కూడిన విధానంలో, విద్యార్థులకు అనుకూలంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ప్రక్రియ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని నడ్డా సూచించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి దశలో సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
విద్యార్థులకు ఊరట కలిగించే మార్పులు..
ఈ ఏడాది కౌన్సెలింగ్ ప్రక్రియలో విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం పలు కీలక సంస్కరణలు తీసుకొచ్చింది. విద్యార్థులు పదేపదే కాలేజీలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒక్కసారి మాత్రమే కాలేజీలో రిపోర్ట్ చేసే విధానాన్ని అమలు చేయనుంది. ధ్రువపత్రాల పరిశీలనను ఆన్‌లైన్‌లోనే వేగంగా పూర్తి చేసేలా ఏర్పాట్లు చేయడంతో పాటు, దివ్యాంగ అభ్యర్థులకు కౌన్సెలింగ్ కేంద్రాల్లో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది.
అదేవిధంగా విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వచ్చే సందేహాలు, ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా అధికారులకు నడ్డా సూచించారు. కౌన్సెలింగ్‌లో ప్రతి దశను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రతిభ ఆధారంగా నిర్వహించాలని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాలపై విద్యార్థుల్లో మరింత విశ్వాసం పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
