ఇంద్రకీలాద్రిపై ఆషాడ వైభవం..

  • తరలివచ్చిన ఆషాఢ సారె బృందాలు

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మను ఇంటి ఇలవేల్పుగా, ఆడపడుచుగా భావించే మహిళా భక్తులు ఆషాఢ సారె ఉత్సవాల్లో భాగంగా బుధవారం పెద్దఎత్తున తరలివచ్చారు. పసుపు, కుంకుమలు, గాజులు, చీరలు, సారెలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆషాఢ సారె ఉత్సవాల 16వ రోజు, శాకంబరీ ఉత్సవాల సందర్భంగా అమ్మవారి సన్నిధిలో మహిళా భక్తుల రద్దీ విశేషంగా పెరిగింది. మొత్తం 28 సారె బృందాలు ఇంద్రకీలాద్రికి చేరుకోగా, ఆయా బృందాల ద్వారా 14,120 మంది భక్తులు సారె సమర్పించారు. సారె బృందాలుగా వచ్చిన భక్తులకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉచిత దర్శన సౌకర్యంతో పాటు దేవస్థానం తరఫున ప్రత్యేకంగా కదంబ ప్రసాదాన్ని అందజేసింది. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఏర్పాట్లు చేయడంతో సారె సమర్పణ కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగింది.