Indrakeeladri | శోభాయమానంగా శాకాంబరీ ఉత్సవాలు..
పూర్ణాహుతితో ముగిసిన మహోత్సవాలు..
45 టన్నుల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, డ్రైఫ్రూట్స్‌తో అలంకరణలు..
శాకంభరీ దేవిగా కనకదుర్గమ్మ దివ్య దర్శనం
మూడు రోజుల్లో సుమారు 2.5 లక్షల మంది భక్తుల దర్శనం..
ఉచితంగా ‘కదంబం’ ప్రసాదం పంపిణీ
సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు..
Indrakeeladri | (ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ) : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో మూడు రోజులుగా అత్యంత వైభవంగా నిర్వహించిన శాకాంబరీ ఉత్సవాలు బుధవారం గురుపౌర్ణమి పర్వదినాన మహాపూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ఉత్సవాల చివరి రోజున అమ్మవారు శాకంభరీ దేవి రూపంలో వివిధ రకాల పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, డ్రైఫ్రూట్స్‌తో అపూర్వంగా అలంకరించబడి భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు.

పూర్ణాహుతితో ముగిసిన ఉత్సవాలు..
శాకంబరీ ఉత్సవాల సమాప్తి సందర్భంగా ఆలయ స్థానాచార్యులు శ్రీ వి. శివప్రసాద శర్మ ఆధ్వర్యంలో వైదిక కమిటీ సభ్యులు, వేదపండితులు, అర్చకస్వాములు వేదమంత్రోచ్చారణల నడుమ మహాపూర్ణాహుతి, కలశోద్వాసన, మార్జనం, ప్రోక్షణ తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. వేలాది మంది భక్తులు ఈ ఆధ్యాత్మిక వేడుకలను భక్తిశ్రద్ధలతో వీక్షించారు.

అందరి సహకారంతో..
దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ మాట్లాడుతూ రైతులు, దాతల సహకారంతో మొత్తం 45 టన్నుల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, డ్రైఫ్రూట్స్‌ను సేకరించి గర్భగుడి, ఉపాలయాలు, ఆలయ ప్రాంగణాన్ని శోభాయమానంగా అలంకరించామని తెలిపారు. సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, రైతాంగం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉత్సవాలను నిర్వహించినట్లు వెల్లడించారు. మూడు రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో సుమారు 2.5 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఈవో తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టడంతో పాటు ఉత్సవాలకు వచ్చిన కూరగాయలతో తయారు చేసిన పవిత్ర ‘కదంబం’ ప్రసాదాన్ని వేలాది మందికి ఉచితంగా పంపిణీ చేశారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన గిరి ప్రదక్షిణలోనూ భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తలు, ప్రధాన అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు, ఏఈఓలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
