ఉట్నూర్ ఏజెన్సీలో ఎడతెరిపి వర్షాలు

పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు.. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి

ఉట్నూర్/జైనూర్, ఆంధ్రప్రభ: ఉట్నూర్ ఏజెన్సీ పరిధిలోని మండలాల్లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నిరంతర వర్షాల ప్రభావంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతూ ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

ఉట్నూర్ ఏజెన్సీ డివిజన్‌లోని ఉట్నూర్, జైనూర్, ఇంద్రవెల్లి, సిర్పూర్ (యు), లింగాపూర్ మండలాల్లో తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ఈ రెండు రోజులుగా అత్యధిక వర్షపాతం నమోదవడంతో ప్రజలు, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఎడతెరిపి వర్షాల కారణంగా ఖరీఫ్ సాగు పనులకు అంతరాయం ఏర్పడింది. పొలాల్లోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

భారీ వర్షాల ప్రభావంతో అనేక వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో మారుమూల గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని సూచిస్తున్నారు.