ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేకంగా బెజ్జంకిలో సంపూర్ణ బంద్

వ్యాపార, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూత.. అనుమతులు రద్దు చేయాలని డిమాండ్

బెజ్జంకి, ఆంధ్రప్రభ: మండలంలో అఖిలపక్ష నాయకుల పిలుపుతో బుధవారం నిర్వహించిన సంపూర్ణ బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ఇథనాల్ ఫ్యాక్టరీకి ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేసి, ఫ్యాక్టరీని మూసివేయాలని డిమాండ్ చేస్తూ బంద్‌కు పిలుపునిచ్చారు.

బంద్ సందర్భంగా మండలంలోని వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ప్రజలు, వ్యాపారవేత్తలు ముందుకు వచ్చి బంద్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బంద్ ప్రశాంతంగా కొనసాగింది.

అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల పర్యావరణం, వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యం, రైతుల జీవనోపాధిని కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే స్పందించి ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ బంద్‌లో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని నిరసన తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో బంద్ ప్రశాంతంగా కొనసాగింది.