వైభవంగా గురుపూర్ణిమ మహోత్సవం.. వర్షంలోనూ పోటెత్తిన భక్తులు

పరకాల (ఆంధ్రప్రభ): పట్టణంలోని శ్రీ శిరిడి సాయిబాబా సత్సంగ్ మందిరంలో బుధవారం గురుపూర్ణిమ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మందిరం వ్యవస్థాపకులు పింగిలి విజయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో, ప్రధాన అర్చకులు కాటూరి రామకృష్ణాచార్యుల ఆచార్యత్వంలో ఉదయం 5 గంటలకు ప్రభాత సేవ, కాకడ హారతితో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం పంచామృత, పంచసూక్త రుద్రాభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

గురుపూర్ణిమ సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ పరకాల పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీ శిరిడి సాయిబాబా దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బాబా భక్తులు, సేవకులు సారంగా నరేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.